జగిత్యాల, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల కక్షసాధింపులో భాగంగానే తనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని బీఆర్ఎస్ నాయకుడు, పెగడపల్లి సింగిల్ విండో చైర్మన్ వోరుగంటి రమణారావు ఆరోపించారు. పెగడపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఆయనపై నమోదైన అట్రాసిటీ కేసుపై శనివారం రాత్రి ప్రకటన జారీ చేశారు. బీఆర్ఎస్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తనను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరాలంటూ ఆ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చారన్నారు. కాంగ్రెస్‌లో చేరకపోవడంతో కక్ష సాధింపు చర్యలు, రాజకీయ వేధింపులు, బెదిరింపులు, తప్పుడు కేసులకు తెగబడుతున్నారన్నారు. పెగడపల్లి సింగిల్ విండో పరిధిలో ఎలాంటి అవకతవకలు జరుగకపోయినా తప్పుడు ఆరోపణలతో చర్యలు చేపట్టారన్నారు. సింగిల్ విండోను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, ఆదర్శ సింగిల్ విండోగా మార్చితే ఎంబీ రికార్డులు లేవంటూ, నిధుల దుర్వినియోగం అంటూ వేధింపులకు గురిచేశారన్నారు.
చర్యలు తీసుకోకుండా ఉండాలంటే తమను కలవాలని, కాంగ్రెస్‌లో చేరాలంటూ బెదిరించారన్నారు. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, పార్టీ మారకపోవడంతో వ్యక్తిగతంగా టార్గెట్ చేసి తప్పుడు కేసులు బనాయించేందుకు తెగబడ్డారన్నారు. ఈ నెల 5న పెగడపల్లిలో అమెరికా నుంచి వచ్చిన మాజీ సర్పంచ్‌తో మాట్లాడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకులు అనవసరంగా వివాదాన్ని సృష్టించారని, వాగ్వాదానికి దిగి ఇష్టారాజ్యంగా మాట్లాడారన్నారు. తాను ఎలాంటి ఘర్షణకు, వాగ్వాదానికి దిగకపోయినా తనపైన తప్పుడు ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేయించారన్నారు. 8న కేసు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతోనే పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని ఆరోపించారు.
ఇంకా పెగడపల్లి పోలీసులు విలేకరుల గ్రూప్‌లో కేసు నమోదు వివరాలను పోస్ట్ చేయడంతోపాటు ప్రతి ఒక్క విలేకరికి ఫోన్ చేసి కచ్చితంగా వార్త ప్రచురితం కావాలని, ఒత్తిడి తేవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రెస్, పోలీస్ గ్రూప్‌తోపాటు ఇతర జనరల్ వాట్సాప్ గ్రూప్‌లో సైతం పోలీసు అధికారే స్వయంగా కేసు నమోదు విషయాన్ని పోస్టు చేసినట్లు తెలుస్తోందని, ఇది సరైన పద్ధతేనా..? అని ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలకడమే గాక, కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి, రాజకీయంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా వేధింపు చర్యలు చేపట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలిపెట్టు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల కక్ష సాధింపు చర్యలకు బెదిరిపోమని, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా పోరాటం చేస్తామన్నారు. పెగడపల్లి సింగిల్ విండో అంశంతో పాటు, ఎస్సీఎస్టీ కేసు విషయమై పాత్రికేయులు నిజనిర్ధారణ చేయాలని కోరారు.
పెగడపల్లి, నవంబర్ 9: పెగడపల్లి విండో చైర్మన్ రమణారావుపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రవికిరణ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5న మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో తోటి నాయకులతో ఉన్న తనను, లింగాపూర్‌కు చెందిన రమణారావు కులం పేరుతో దూషించాడని విజయభాస్కర్ ఫిర్యాదు చేయగా, జగిత్యాల డీఎస్పీ ఆదేశాల మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు వివరించారు.