సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 17 : శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సిరిసిల్లలో నిర్వహించిన రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఆద్యంతం భక్తుల గోవింద నామస్మరణతో కార్మికక్షేత్రం పులకరించిపోయింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మాడ వీధుల గుండా జరిగిన రథోత్సవంలో శ్రీనివాసుడు రథంపై భక్తులకు దర్శనమిచ్చాడు. భక్తుల కోలాటాలు.. గోవింద నామస్మరణలతో పురవీధులు మారుమోగాయి. సాయంత్రం 5 గంటల ప్రాంతం లో ప్రారంభమైన రథోత్సవం సుమారు గంట వరకు సాగింది. అనంతరం రాత్రి 10 గంటలకు అశ్వవాహనంపై దోపు కథ కార్యక్రమం కనుల పండువగా జరిగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రథోత్సవంలో పాల్గొన్నారు. రథంపై కొలువుదీరిన దేవదేవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.