కలెక్టరేట్, అక్టోబర్ 18: అసెంబ్లీ ఎన్నికల విధులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ బీ గోపి అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో బుధవారం సెక్టోరల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు తీసుకుని, విధుల పట్ల అంకితభావంతో ఉండాలని సూచించారు. సెక్టోరల్ అధికారి ప్రతి పోలింగ్ స్టేషన్‌ను సందర్శించి, ఇతర వసతుల ఏర్పాట్లను పరిశీలించాలని ఆదేశించారు. ఈవీఎంలపై పరిపూర్ణ అవగాహన పెంచుకోవాలని, పీవోలు తాము నిర్వహించబోయే విధులపై నిబద్ధత ప్రదర్శించాలన్నారు.
పోలింగ్ రోజు, అనంతరం సమర్పించే నివేదికలపై, ఈవీఎం పనిచేసే విధానంపై క్షుణ్ణంగా తెలిసి ఉండాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు, టాయ్లెట్లు, ఇతర వసతులు సమకూర్చుకోవాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ఏమైనా ఘటనలు జరిగితే, వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలన్నారు. ఈసారి ఎలక్టోరల్ను ఇంటి నంబర్ ఆధారంగా ఆల్ఫాబెటికల్ పరంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈవీఎం యంత్రాలను అధికారులు వారికి కేటాయించిన వాహనాల్లో తీసుకెళ్లాలని, అనుమతి లేని ప్రైవేటు వాహనాల్లో తరలించరాదని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు ఈవీఎంలలో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తినట్లయితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో పవన్‌కుమార్, మార్కెటింగ్ అధికారి పద్మావతి, డీఈవో జనార్దన్‌రావు, మెప్మా పీడీ రవీందర్, పరిశ్రమల శాఖ అధికారి నవీన్, సెక్టోరల్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసి, సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ బీ గోపి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేదర్ ప్రభుత్వ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ మహిళా (ఎస్సీ) కళాశాలలో ఏర్పాటు చేసిన మానకొండూర్ నియోజకవర్గం డిస్ట్రిబ్యూషన్, రిసిప్షన్ కేంద్రాలను ఆయన అదనపు కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని సూచించారు. అనంతరం కళాశాల పరిసరాలను పరిశీలించారు. వాహనాల పారింగ్ కోసం అవసరమైన స్థలాన్ని చదును చేయాలన్నారు. అలాగే, మానకొండూర్ తహసీల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సి-విజిల్, సువిధ, కంట్రోల్ రూంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి వద్ద గల చెక్ పోస్ట్ వద్దకు వెళ్లి తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, తహసీల్దార్ కనకయ్య, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.