కరీంనగర్ కేంద్రంగా ‘మెడిసిన్ దందా’కు అడ్డులేకుండా పోయింది. కొందరు వైద్యులు, మెడికల్ ఏజెన్సీలు, షాపుల నిర్వాహకులు కొన్ని ఫార్మా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి, ఏకంగా తమకు అవసరమైన మందులు తయారు చేయించుకుంటున్నట్లు తెలుస్తున్నది. అయితే ఇతర రాష్ర్టాలు, ముఖ్యంగా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం కాగా, అందులో ఎక్కువగా ప్రముఖ వైద్యులు భాగస్వాములు అవుతున్నట్టు తెలిసింది.
అవసరమైన మందులను వేరే కంపెనీ నుంచి కొనుగోలు చేయడం దేనికని, నేరుగా ఆర్డర్ ఇచ్చి మరీ తయారు చేయించుకుంటున్నట్టు చర్చ జరుగుతున్నది. ఓ కంటి దవాఖాన ఇలానే తమకు ప్రత్యేకంగా మందులు తయారు చేయించుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఎక్కువగా అన్‌బ్రాండెడ్ మందుల తయారీవైపే మొగ్గు చూపుతూ, అనతికాలంలోనే కోట్లకు పడగెత్తుతున్నట్టు తెలుస్తున్నది.
కరీంనగర్, జూలై 9 (నమస్తే తెలంగాణ)/ విద్యానగర్ : ఒకప్పుడు రోగుల కోసం మందుల తయారీకి ఎన్నో నిబంధనలు ఉండేవి. నాణ్యత ప్రమాణాలు పాటించి తయారు చేయాలంటే ప్రభుత్వ పర్యవేక్షణలో అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ప్రముఖ ఫార్మా కంపెనీలే ఈ మందులు తయారు చేసేవి. అయితే రోగాల వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో ఫార్మసీ అవసరాలు కూడా పెరిగాయి.
ఫార్మా కంపెనీల ఏర్పాటు కూడా సులభతరంగా మారింది. ముఖ్యంగా కరోనా తర్వాత ప్రముఖ కంపెనీలకు దీటుగా చిన్న చిన్న ఫార్మా కంపెనీలు కూడా మందుల తయారీలో పోటీ పడుతున్నాయి. కుటీర పరిశ్రమల్లా వెలుస్తున్న ఈ కంపెనీల్లో కొందరు వైద్యులు, మెడికల్ ఏజెన్సీల నిర్వాహకులు, మెడికల్ దుకాణాల యజమానులు కూడా పెట్టుబడులు పెడుతున్నట్టు తెలుస్తున్నది. మెడికల్ వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారిన కరీంనగర్‌కు చెందిన కొందరు ఈ వ్యాపారంలో అడుగుపెట్టినట్టు తెలుస్తున్నది.
తమకు అవసరమైన మందులను వేరే కంపెనీ నుంచి కొనుగోలు చేయడం దేనికని కొందరు వైద్యులు ఆర్డర్స్ ఇచ్చి తయారు చేయించుకుంటున్నట్టు చర్చ జరుగుతున్నది. గతంలో ఎలాంటి మందులు కావాలన్నా ఇక్కడి ఏజెన్సీలతో మాట్లాడుకునే వైద్యులు ఇప్పుడు నేరుగా ఫార్మా కంపెనీలతోనే చర్చించి ఆర్డర్ ఇస్తున్నట్టు తెలుస్తున్నది. కొందరు వైద్యులు కలిసి ఏకంగా ఫార్మా కంపెనీలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్టు సమాచారం. మెడికల్ దుకాణాల నిర్వాహకులు కూడా ఈ దందాలో భాగస్వాములవుతూ పలు ఫార్మా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే స్థాయికి వెళ్లినట్టు ప్రచారం జరుగుతున్నది.
ఇతర రాష్ర్టాల్లో కంపెనీల ఏర్పాటు
కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రముఖ కంటి దవాఖానతోపాటు కొన్ని ప్రముఖ దవాఖానలు, నర్సింగ్ హోంలు ఇతర రాష్ర్టాల్లో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలిసింది. ప్రభుత్వ పరమైన టాక్స్‌లకు మినహాయింపు ఉంటుందని కేంద్ర పాలిత ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసుకుంటున్నట్టు సమాచారం. ఓ కంటి దవాఖానతోపాటు కొందరు వ్యాపారులకు సిక్కింలో ఫార్మా కంపెనీలు ఉన్నట్టు తెలుస్తున్నది. అంతే కాకుండా అనుమతులు సులభంగా లభించే గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాల్లోని ఫార్మా కంపెనీల్లో ఇక్కడి వారికి వాటాలు ఉన్నట్టు సమాచారం అందుతున్నది.
ఇక్కడి నుంచి సబ్ స్టాండెడ్, అన్ బ్రాండెడ్ మందులు తయారు చేయించుకొని, జిల్లాకు తెప్పించి బ్రాండెడ్ మందులతో సమానంగా రోగులకు అంటగడుతున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద మొత్తంలో వ్యాపారం జరుగుతున్న నేపథ్యంలో కొన్ని ప్రముఖ కంపెనీలు ఇక్కడి వైద్యులతో పెట్టుబడులు పెట్టించుకుంటున్నట్టు తెలుస్తున్నది. వైద్యులు, ఏజెన్సీ సంస్థలు, మెడికల్ దుకాణాల నిర్వాహకులు ఎవరైనా ఫార్మా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడాన్ని తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ, వారి కనుసన్నల్లో తయారయ్యే మందుల నాణ్యతపైనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అన్ బ్రాండెడ్‌తో లాభాల పంట
మల్టీ నేషన్ కంపెనీలకు దీటుగా పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న చిన్న చిన్న కంపెనీలు తమతోపాటు అందులో భాగస్వాములవుతున్న వారందరికీ లాభాల పంట పండించేలా అన్‌బ్రాండెడ్ మందుల తయారీకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది. బ్రాండెడ్ కంపెనీల నుంచి ఫార్ములా తెప్పించుకుని హైదరాబాద్ వంటి నగరాల్లో ట్యాబ్లెట్లు తయారు చేయించుకుంటున్నట్టు సమాచారం. అందులో ఫార్ములా ఎంత వరకు ఉంటుందనేది ప్రశ్నార్థకమే అయినా ధరలు తగ్గించి, డిస్కౌంట్లు ఇచ్చే సరికి రోగులు ఆకర్శితులవుతున్నారు.
తక్కువ ధరకు వస్తున్నాయని వాడుతున్న రోగులు మళ్లీ మళ్లీ దవాఖానల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. వైద్యులను నమ్మి అన్ బ్రాండెడ్ మందులు వాడితే రోగాలు నయం కాకుంటే బాధ్యులెవరనే జవాబుదారీతనం లేకుండా పోయింది. అన్ బ్రాండెడ్ మందుల తయారీకి వెలుస్తున్న కంపెనీలను తట్టుకోలేక కొన్ని మల్టీ నేషన్ కంపెనీలు ఏకంగా మందుల తయారీనే నిలిపివేసుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి అన్‌బ్రాండెడ్ మందులు కరీంనగర్ మెడికల్ మార్కెట్లో విరివిగా లభిస్తుండడం, కొందరు వైద్యులు కూడా వీటినే రోగులకు సిఫారసు చేయడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. వీటిని తయారు చేసే కంపెనీలకు లాభాల పంట పండిస్తుంటే రోగాలు నయంకాక వ్యాధిగ్రస్తులు ప్రాణాల మీదకు వస్తున్నది.