కొండమల్లేపల్లి, జూలై 25 : ఉపాధ్యాయుడు అకారణంగా కొట్టడంతో మనస్థాపానికి గురై ఏడో తరగతి విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నాంపల్లి మండలంలోని ముష్టిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రాజ్యాతండాకు చెందిన రమావత్ కన్య, పద్మ దంపతుల కుమారుడు రమావత్ సంతోష్, స్థానిక సాయి సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. గురువారం సాయంత్రం సంతోష్ రోజు మాదిరిగానే ఇంటికి వెళ్లే క్రమంలో వ్యాను ఎక్కుతుండగా లైనులో రావాలంటూ వ్యాయామ ఉపాధ్యాయుడు చందు, విద్యార్థి సంతోష్‌ను విచక్షణా రహితంగా కట్టెతో చితకబాదినట్లు సమాచారం. వ్యాయామ టీచర్ ప్రవర్తనతో మనస్థాపానికి గురైన సంతోష్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్లి ఇంట్లోని పురుగుల మంది తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
వాంతులు చేసుకుంటున్న అన్న సంతోష్‌ను చూసి చెల్లెలు పొలంలో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. దీంతో సంతోష్ తల్లిదండ్రులు ఇంటికి వచ్చి జరిగిన విషయం తెలుసుకుని హుటాహుటిన ఓ పైవేట్ వాహనంలో దేవరకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం డాక్టర్ల సూచన మేరకు మేరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. సంతోష్ తల్లి పద్మ మాట్లాడుతు సాయి సిద్ధార్థ పాఠశాల ఉపాధ్యాయుల తీరు ఏ మాత్రం బాగోలేదనారు. సంతోష్‌ను వ్యాయామ ఉపాధ్యాయడు పలుమార్లు అకారణంగా కొట్టాడన్నారు. తమ బాబు ఫిర్యాదు చేసినా తాము సర్ధిచెప్పి పాఠశాలకు పంపేవారమని అన్నారు. ఈ రోజు కూడా తమ కొడుకుని అకారణంగా కొట్టడడంతో మనస్థాపంతో పురుగుల మందు తాగాడని కన్నీరు మున్నీరుగా విలపించింది. తమ బిడ్డ పరిస్థితికి కారణమైన వ్యాయామ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరింది.