ఉద్యమనేత, ప్రగతి ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరీంనగర్ జిల్లా అంటే ప్రత్యేకమైన అభిమానం! ఎనలేని అనుబంధం! అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించిన తర్వాత ఈ గడ్డ మీదనే ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి శ్రీకారం చుట్టారు. ఉద్యమం పతాక స్థాయికి చేరుకున్న తర్వాత ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న కేసీఆర్‌ను, అలుగునూర్లోనే అరెస్ట్ చేసినా, ఆ తర్వాత వెనక్కి తగ్గకుండా పోరాటం చేశారు. కరీంనగర్ ఎంపీగా ఒకసారి జనరల్ ఎన్నికల్లో, రెండు సార్లు ఉప ఎన్నికల్లో ఇక్కడి నుంచే విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఇలా కరీంనగర్ జిల్లా ఉద్యమ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న ఆయన, ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కీలక పథకాలను ఈ ప్రాంతంలోనే ప్రారంభించారు. సక్సెస్ ఫుల్‌గా నడిపించారు. అందుకే కరీంనగర్ అంటే కేసీఆర్ సెంట్మెంట్ జిల్లాగా నిలిచిపోయింది. అన్నివిధాలా కలిసివచ్చింది. సోమవారం కేసీఆర్ బర్త్‌డేను పండుగలా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా సిద్ధమైంది.
కరీంనగర్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ మలి దశ ఉద్యమానికి కరీంనగర్ జిల్లా ఊపిరి పోసింది. తెలంగాణ ఉద్యమం జరిగిన 14 ఏండ్లు కరీంనగర్ జిల్లా కేసీఆర్‌కు కొండంత అండగా నిలబడింది. ఉద్యమంలో తీసుకున్న అనేక కీలక నిర్ణయాలను ఆయన ఇక్కడి నుంచే ప్రకటించారు. ఉత్తర తెలంగాణకు కేంద్రంగా నిలిచిన కరీంనగర్‌లోనే రోజుల తరబడి ఉంటూ ఉద్యమకారులకు దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో గులాబీ జెండా ఎగుర వేసిన కేసీఆర్, ఆ తర్వాత సరిగ్గా 20 రోజులకు 2001 మే 17న కరీంనగర్లో సింహగర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించి ఉద్యమ శంఖారావం పూరించారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిర్వహించిన మొదటి బహిరంగ సభకు తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది జనం పార్టీలకు అతీతంగా తరలి వచ్చి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఆ రోజు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తున్న కేసీఆర్‌కు అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు. ఈ కొద్ది దూరం రావడానికి ఆయనకు ఆ రోజు 8 గంటల సమయం పట్టిందంటే ప్రజలు ఏ స్థాయిలో కేసీఆర్‌కు స్వాగతాలు పలికారో అర్థం చేసుకోవచ్చు. సభలో దాదాపు గంట పాటు ప్రసంగించిన కేసీఆర్ తెలంగాణకు జరుగుతున్న ఒక్కో అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు. ఈ సభతో తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించిన జిల్లాగా కరీంనగర్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఆ తర్వాత జిల్లా ప్రజలు కేసీఆర్ ఉద్యమ దన్నుగా నిలుస్తూ వచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ జడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని జిల్లా పరిషత్‌లో అధికారంలోకి వచ్చింది. అనేక మండల ప్రజా పరిషత్తులను స్వాధీనం చేసుకున్నది. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన కేసీఆర్‌ను 1,31,168 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తనకు తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని భావించి, తన కేంద్ర మంత్రి పదవికి, ఎంపీకి రాజీనామా చేశారు. 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక కుట్రలు చేసినా జిల్లా ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారు.
అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ధన బలంతో ప్రలోభాలకు గురి చేసినా 2,01,582 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై ఘన విజయం అందించారు. ఆ తర్వాత 2008లో మరో సారి రాజీనామా చేసి తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించిన సందర్భంలోనే జిల్లా ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారు. కరీంనగర్ పార్లమెంట్‌కు రెండోసారి వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ విజయం సాధించి తెలంగాణ సెంటిమెంట్‌ను బతికించారు. ఇక 2009లో ఉద్యమం పతాక స్థాయికి చేరుకున్నది. కేసీఆర్ కరీంనగర్‌లోనే ఉండి వ్యూహాలు రచించారు. 2009 నవంబర్ 29న సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టే లక్ష్యంతో కరీంనగర్ నుంచి బయలుదేరిన ఆయనను, నగర శివారులోని అల్గునూర్‌లో అరెస్ట్ చేసి ఖమ్మం తరలించారు. ఈ ఘట్టం కూడా చరిత్రలో శాశ్వతంగా నిలిచి పోయింది. ప్రతి ఏడాది బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు అల్గునూర్‌లో కేసీఆర్ అరెస్ట్ అయిన చోట దీక్షా దివస్ జరుపుకొంటున్నారు.
కీలక పథకాలు ఇక్కడే ప్రారంభం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా కేసీఆర్ కరీంనగర్‌పై తనకు ఉన్న అభిమానాన్ని, సెంటిమెంట్‌ను నిత్యం ప్రకటించుకున్నారు. అనేక కీలక పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభించి విజయవంతంగా అమలు చేశారు. కరీంనగర్లో ప్రారంభించిన పథకాలు ఐక్యరాజ్య సమితి ప్రశంసలు అందుకున్నాయి. దేశానికే దిక్సూచిగా నిలిచాయి. ముఖ్యంగా ఉద్యమ సమయంలో నిత్యం రైతుల గురించి ఆలోచించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు రైతు బంధు పథకాన్ని తెచ్చారు. 2018 మే 10న ఈ పథకాన్ని హుజూరాబాద్ మండలం శాలపల్లి- ఇందిరానగర్ గ్రామంలో ప్రారంభించి, ఇదే మండలంలోని ధర్మరాజ్పల్లి రైతులకు మొదటి చెక్కులు అందించారు. రైతుల బంధు సమితులను ఏర్పాటు చేసిన తర్వాత 2018 ఫిబ్రవరి 26న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించారు.
ఈ సదస్సులో రైతులు చేసిన విజ్ఞప్తి మేరకు రైతుబీమా అమలు చేస్తామని కీలక ప్రకటన కూడా ఇక్కడి నుంచే చేశారు. 2018 ఆగస్టు 14 నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఇలా అనేక పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభించిన కేసీఆర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణను వాటర్ హబ్‌గా మార్చారు. ఈ ప్రాజెక్టు కూడా ప్రపంచంలోనే అత్యంత కీలక ప్రాజెక్టుగా కీర్తి కెక్కింది. మరో కీలకమైన దళితబంధు పథకానికి కూడా కేసీఆర్ ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టారు. 2021 ఆగస్టు 16న హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించి ఇదే మండలంలోని శాలపల్లి- ఇందిరానగర్ గ్రామంలోనే ప్రారంభించారు. క్రమంగా రాష్ట్రంలోని పలు గ్రామాలకు విస్తరించారు. వేలాది దళిత కుటుంబాల్లో వెలుగులు నింపారు. కరీంనగర్ సెంటిమెంట్‌తో కేసీఆర్ ఇక్కడ ప్రారంభించిన ప్రతి పథకం విజయవంతంగా అమలైంది. దేశంలోని ఇతర రాష్ర్టాల ప్రభుత్వాల ప్రతినిధులు, అధ్యయ బృందాలు వచ్చి జిల్లాలో పథకాల అమలు తీరును పరిశీలించారు. కేసీఆర్ పాలనలో ఇక్కడ ప్రారంభించిన రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు వంటి సామాజిక ధృక్పథంతో ప్రారంభించిన పథకాలను ఏకంగా ఐక్యరాజ్య సమితి నేరుగా ప్రశంసించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఊరూరా మొక్కలు నాటాలి
మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
గంగాధర, ఫిబ్రవరి 16: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా ఈ నెల 17న చేపట్టిన వృక్షార్చనను విజయవంతం చేయాలని, ఊరూరా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన బూరుగుపల్లిలో ముందస్తుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సుంకె మాట్లాడుతూ, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పర్యావరణ పరిరక్షణకు హరితహారం కార్యక్రమం ప్రారంభించారని, లక్షలాదిగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారని చెప్పారు. ఆయన కృషితోనే తెలంగాణ ఇవ్వాళ పచ్చగా ఉందన్నారు. కేసీఆర్ హరితహారం స్పూర్తితో అప్పటి రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను ప్రారంభించి దేశ వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, నాయకులు దూలం శంకర్‌గౌడ్, గడ్డం స్వామి, అన్నల్దాస్ తిరుపతి,లంక హరిబాబు, తడగొండ అజేయ్, దూలం బాలగౌడ్, ఉత్కం మురళి, పోన్నం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
బర్త్‌డే కానుకగా..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్‌డేను సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పండుగలా నిర్వహించేందుకు బీఆర్ఎస్ దళం సిద్ధమైంది. కేసీఆర్ సీఎం అయిన తర్వాత చేపట్టిన హరితహారం రాష్ట్రంలో విజయవంతమైంది. ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో పచ్చదనం పరుచుకున్నది. ఏటా హరితహారాన్ని ఎంతో గొప్పగా నిర్వహించడం పచ్చదనంపై ఆయనకున్న మక్కువను తెలిపేది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త తమ కుటుంబ సభ్యులతో కలిసి మూడు మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఖాళీ స్థలాలు, రోడ్ల పక్కన కూడా సామూహికంగా మొక్కలు నాటి కేసీఆర్‌కు వృక్షార్చన కానుకగా ఇవ్వాలని ఉత్సాహంగా ఉన్నారు. అంతే కాకుండా కేక్ కట్ చేయడం, రక్త దానాలు, అన్నదానాలు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వృక్షార్చన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఇప్పటికే బీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షలు పిలుపు నిచ్చారు. ఎమ్మెల్సీ కోడ్ ఉన్నదని ఎవరూ వెనుకడుగు వేయరాదని, ఇది ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదని వివరించారు.
వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా వృక్షార్చన చేస్తున్నాం. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త, నాయకులు మూడు చొప్పున మొక్కలు నాటి అధినేతకు కానుకగా ఇస్తున్నాం. కార్యకర్తలే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. ప్రతి మండల కేంద్రం, గ్రామాల్లో కేక్‌లు కట్ చేస్తున్నాం. రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆలయాల్లో ప్రత్యేక అర్చనలు చేస్తున్నాం. ప్రతి కార్యకర్త కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొనాలి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నదని వెనుకడుగు వేయవద్దు. ఇది దాని పరిధిలోకి రాదు. వేడుకలు జిల్లాలో గొప్పగా జరిపేందుకు కార్యాచరణ చేసుకున్నాం.
– జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు