కోరుట్ల, జూలై 9: ఆన్లైన్ బెట్టింగ్‌లో తీవ్ర నష్టాలు.. కుటుంబ సభ్యుల ఛీత్కారాలు మమత మనసులో చిచ్చురేపాయి. కర్కోటకురాలిగా మార్చాయి. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడం, అవమానాలు పెరగడం, ఇంట్లో తోటి కోడలుకు ప్రాధాన్యం పెరిగిపోవడంతో కక్ష పెంచుకొని ఆమె కూతురు హితీక్షను మమత దారుణంగా హతమార్చింది. కోరుట్లలో శనివారం జరిగిన చిన్నారి హత్య ఘటనలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.
తన బిడ్డలతోపాటు తోడి కోడలు పిల్లలు హితీక్ష, వేదాన్ష్‌ను అల్లారుముద్దుగా చూసుకుంటూ రోజూ ముస్తాబు చేసి స్కూల్‌కు పంపించే నిందితురాలు మమత ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నామని స్థానికులు చెబుతున్నారు. కాగా, మమత కొద్దిరోజులుగా ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసగా మారిపోయింది. ఉన్నత విద్యావంతురాలైన ఆమె, స్థానికంగా ఉన్న ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, కొద్దిరోజుల క్రితమే మానేసింది. తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలు విక్రయించి 35 లక్షలు ఆన్లైన్లో పెట్టి డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలుస్తున్నది.
ఈ విషయమై రెండు నెలల క్రితం సైబర్ క్రైమ్‌లో కేసు కూడా నమోదైనట్టు సమాచారం. ఆన్లైన్ ఉచ్చులో ఇరుక్కుని ఆర్థికంగా నష్టపోయి మానసిక ఆందోళనకు గురైనట్టు తెలుస్తున్నది. డబ్బులు పోగొట్టుకున్న విషయం ఇంట్లో తెలియడంతో మమత చీత్కారాలు ఎదుర్కొన్నట్టు వినికిడి. ఈ క్రమంలోనే తన ఇద్దరు కూతుళ్లను తక్కువ చేసి చూస్తున్నారని మదన పడినట్టు తెలుస్తున్నది. దీనికితోడు తోటి కోడలు ఇంట్లో పెత్తనం చెలాయిస్తున్నదని ఆమెపై కక్ష పెంచుకున్నదని తెలిసింది.
నవీన కూతురు హితీక్షను చంపితే తన కూతుళ్లకు కుటుంబంలో గౌరవం దక్కుతుందనే భావనలో హత్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. అదే సమయంలో తాను చేసిన నేరాన్ని కాలనీలో వివాదాస్పదుడిగా ఉన్న వ్యక్తిపై నెట్టివేసేందుకే హితీక్షను చంపేందుకు అతని ఇంటిడి ఎంచుకున్నదని సమాచారం.