Insurance scheme | జగిత్యాల, జులై 27 : రైతు బీమా పథకంలో సీనియర్ సిటీజేన్స్ రైతులను సైతం చేర్చాలని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా కేంద్రంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రైతు భరోసా పోర్టల్ ప్రకారం జగిత్యాల జిల్లాలో 2.48 మంది రైతులున్నారని, కాగా రైతు బీమా పథకంలో మాత్రం ఆ సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు.
జిల్లాలో ఏటా రైతు బీమా పథకంలో 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకున్న రైతులే అర్హులు కాగా 60 నుంచి 80 ఏళ్ల వరకున్న సీనియర్ సిటిజెన్లయిన రైతులను సైతం ఈ సారి చేర్చేలా చర్యలు తీసుకుంటే రైతులకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించామన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, ఉపాధ్యక్షుడు పీసీ హన్మంత రెడ్డి, ఎండీ యాకూబ్, కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి పీ ఆశోక్ రావు, కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం, సంయుక్త కార్యదర్శులు రాజ్ గోపాల్ చారి, దిండిగాల విఠల్, రైతు నాయకురాళ్లు జలజ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.