ఈ పథకం దేశానికే ఆదర్శం
దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం
ఇక అసమానతలకు చెల్లు
ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంపిక
లబ్ధిదారులకు నచ్చిన యూనిట్లు ఎంచుకునే స్వేచ్ఛ
మెట్పల్లి టౌన్, మార్చి 1;దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని, అందులో భాగంగానే దళితబంధు అమలు చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే, జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. ఈ పథకంతోనే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని, అసమానతలు తొలిగిపోతాయని చెప్పారు. నాటి పాలకులు ఒక పథకం ప్రవేశపెడితే దాన్నే ముందుపెట్టి దశాబ్దాల తరబడి ఓట్లు అడిగేవారని విమర్శించారు. కానీ, సీఎం కేసీఆర్ రాజకీయంగా లాభనష్టాలను పట్టించుకోకుండా పేదల అభ్యున్నతికి అద్భుతమైన పథకాలు ప్రవేశపెడుతున్న అభ్యుదయవాది అని, దేశంలోనే మానవీయ సీఎం ఆయన ఒక్కరేనని కొనియాడారు. కోరుట్ల నియోజకవర్గంలో దళితబంధు అమలుకు తీసుకుంటున్న చర్యలు, లబ్ధిదారుల ఎంపిక, పథకంపై అవగాహన కల్పిస్తున్న తీరును మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్య్యూలో ఆయన వివరించారు. –
దళితుల్లో సామాజిక వెనుకబాటును పోగొట్టి వారిని అభివృద్ధి చేసే దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని కోరుట్ల ఎమ్మెల్యే, జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు స్పష్టం చేశారు. ఈ పథకం దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని, దళిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నదని, వారి ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్నదని అభివర్ణించారు. దళితబంధు అమలు తీరుపై ఆయన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన నియోజకవర్గంలో ఏ విధంగా అమలు చేయబోతున్నారు? లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉండబోతున్నది? అనే విషయాలను వివరించారు.
నమస్తే : కోరుట్ల నియోజకవర్గంలో దళితబంధు ఎలా అమలు చేయబోతున్నారు?
ఎమ్మెల్యే : నియోజకవర్గంలో తొలివిడుతగా వంద దళిత కుటుంబాలకు దళితబంధు అమలు చేస్తున్నాం. ఇందుకు సంబంధించి నియోజకవర్గంలో అర్హులైన వంద కుటుంబాలను ఎంపిక చేసే ప్రక్రియను పూర్తి చేశాం. అధికారులు ఇప్పటికే ఎంపికకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం.
నమస్తే : పథకంపై ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు?
ఎమ్మెల్యే : కోరుట్ల నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే దళితబంధు అమలు కోసం ప్రత్యేకాధికారులను నియమించింది. వారు దళితులకు ఈ పథకం పై అవగాహన కల్పిస్తున్నారు. యూనిట్ల ఎంపిక, ఉపాధి మార్గాలపై వివరిస్తున్నారు. ఎంపిక చేసిన ప్రతి దళిత కుటుంబం రూ. 10లక్షలతో వ్యాపారం చేసుకునే అవకాశముంది. దీనిపై దళితులకు అవగాహన కల్పిస్తున్నాం.
నమస్తే : యూనిట్ల ఎంపిక ఎలా జరిగింది?
ఎమ్మెల్యే : దళితులు తమకు నచ్చిన వ్యాపారం చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఈ పథకంలో ఉంటుంది. ఎంపికైన లబ్ధిదారులు ఎక్కడైనా వ్యాపారాన్ని నిర్వహించుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. దళితబంధుకు ఎంపికైన లబ్ధిదారుల డిమాండ్‌ను బట్టి వ్యాపారం చేస్తే లాభదాయకంగా ఉంటుంది.
నమస్తే : లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎంత వరకు వచ్చింది?
ఎమ్మెల్యే : తొలిదశలో కోరుట్ల నియోజకవర్గానికి వంద కుటుంబాలను దళితబంధు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరుపేద దళితులకు ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించాం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ కొనసాగించాలని అధికారులను కోరాం. దళితబంధు పథకం అమలుతో దళితులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దేవుడిగా కొలుస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఈ తరహా సంక్షేమ పథకాలు అమలు చేయలేదు.
నమస్తే : ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఎమ్మెల్యే : దేశంలోని ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. దశాబ్దాల తరబడి ఆర్థిక అసమానతలతో ఇబ్బంది పడుతున్న దళితులకు ఈ పథకం ఒక వరం. వ్యాపారం నిర్వహించే సామర్థ్యం, శ్రమించే శక్తి ఉన్నా.. పెట్టుబడి లేక ఎంతో మంది దళితులు ప్రగతి సాధించలేకపోయారు. ఈ పథకం అమలుతో వ్యాపారం చేయాలని.. ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకునే వారి కోరిక తీరనున్నది. దళితుల అభ్యున్నతికి ఈ పథకం ఎంతో దోహదపడుతుంది.