Ramagiri | రామగిరి : బ్యాంకులలో భద్రత చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మంథని సీఐ బొల్లపల్లి రాజు గౌడ్ బ్యాంకు అధికారులకు సూచించారు. రామగిరి మండలంలోని పలు బ్యాంకులను రామగిరి ఎస్సై తాడవేని శ్రీనివాస్ తో కలిసి ఆయన మంగళవారం సందర్శించారు. బ్యాంకులలో అలారం సిస్టం, సీసీ కెమెరాల పనితీరు, సెక్యూరిటీ గార్డ్స్ ఇతర భద్రత ఏర్పాట్లు,ఏటీఎం సెంటర్ లలో అలారం సిస్టమ్, సీసీ కెమెరాల పని తీరు, ఇతర భద్రత విషయాలపై పరిశీలన చేశారు. అనంతరం సిఐ మాట్లాడుతూ బ్యాంకుల రక్షణ కోసం సీసీ కెమెరాలు నిత్యం పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
లాకర్ , అలారమ్ సిస్టమ్లు తప్పనిసరిగా పనిచేయాలన్నారు. ప్రజల డబ్బులకు భద్రత కల్పించేవి బ్యాంకులని దీన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బ్యాంకు, ఏటీఎం సిబ్బందికి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇటీవల కరీంనగర్ లో జరిగిన బంగారం దుకాణం దోపిడీ ఘటనను ఉదాహరణగా తీసుకుని, ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. “మీ సమాచారం ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు… ఒక నేరాన్ని అడ్డుకోవచ్చు. మీ సహకారం సురక్షిత సమాజానికి మా బలం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.