local body elections | ధర్మారం,అక్టోబర్ 8: అధికారులు జనాభా లెక్కల్లో తమను తక్కువగా నమోదు చేయడం వలన స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము రిజర్వేషన్ కోల్పోయి నష్టపోతున్నామని. తమకు న్యాయం చేసి రిజర్వేషన్లు పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామ ఎస్సీలు కలెక్టర్ కోయ శ్రీహర్షకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు పత్రాన్ని వారు విలేకరులకు అందజేశారు. వారి వివరాల ప్రకారం.. 2011 లో జరిగిన జనాభా లెక్కల సందర్భంగా ఖిలావనపర్తి గ్రామంలోని ఎస్సీలను కేవలం 4 జనాభా ఉన్నట్లు నమోదు చేశారు.
గ్రామంలోని మిగతా సామాజిక వర్గాలను జనాభా ఉన్నట్లు చూపి కేవలం ఎస్సీ జనాభాను తక్కువగా ఉన్నట్లు అధికారులు తప్పుగా నమోదు చేశారు. ఈ గ్రామ జనాభా గెజిట్ పబ్లికేషన్ కావడంతో అప్పటినుంచి స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఎస్సీలు రిజర్వేషన్లు కోల్పోతున్నారు. కేవలం నలుగురు ఎస్సీలు మాత్రమే ఉండడం వలన ఆ గ్రామానికి ఎస్సీ సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డు సభ్యుల పదవులు రిజర్వేషన్లు కేటాయించడం జరగడం లేదు. దీంతో ఇప్పటివరకు 2013, 2018లో జరిగిన స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఆ గ్రామ ఎస్సీలు పోటీ చేయని పరిస్థితి ఏర్పడింది. తాజాగా ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో కూడా వారు పోటీ చేయకుండా అవకాశం కోల్పోయారు.
ఈ క్రమంలో అధికారుల తప్పిదం వలన తాము మూడు పర్యాయాలు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు కోల్పోయి నష్టం జరుగుతుందని ఈ క్రమంలో తగిన విచారణ జరిపించి ఎస్సీలకు స్థానిక సంస్థల ఎన్నికల పదవుల్లో రిజర్వేషన్లు పునరుద్ధరణ చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వారు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.