Odela | ఓదెల, జూన్ 25: పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లిలో మత్తు పదార్థాలు వ్యతిరేక అవగాహన వారోత్సవాలు ఎస్సై దీకొండ రమేష్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఇందులో ఎస్సై మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజం కలిసి రావాలని ఇది ఒక వ్యక్తిని చంపడమే కాదు, సమాజంలోని అన్ని రకాల సమస్యలకు దారితీస్తుందన్నారు. డ్రగ్స్‌కు నో చెప్పడంలో యువత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాలి అని అన్నారు. డ్రగ్స్ అలవాటుపడి యువత తమ మేధాశక్తిని వృథా చేసుకోకూడదన్నారు.
డ్రగ్స్ ఒకసారి వాడినా వ్యసనంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ వినియోగాన్ని యూత్ సోషల్ స్టేటస్, ఫ్యాషన్‌గా ఎంచుకుంటోందని, దీనిద్వారా విలువైన జీవితాలు నష్టపోతారని ఆయన అన్నారు. భవిష్యత్ లక్ష్యాలను ఎంచుకుని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ తీసుకుని వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తాయన్నారు. సహనం కోల్పోయి ఇతరులపై దాడులు, హత్యలు, దొంగతనాలాంటి నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. స్కూళ్లు, కళాశాలలు, ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకుంటున్నా, విక్రయిస్తున్నా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పొత్కపల్లి హైస్కూల్ అధ్యాపక బృందం, పోలీస్ సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.