కరీంనగర్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నదని వ్యవసాయ శాస్త్ర వేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ పంటను ఏ విధంగా రక్షించుకోవాలో తెలుపుతూ రైతులకు సూచనలు చేస్తున్నారు. మరి కొద్ది రోజులు మోస్తారు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నందున రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ సూచిస్తున్నారు.
వరి
ప్రస్తుతం జిల్లాలో ఎక్కువగా నారు మడులు ఉన్నాయి. వాటిలో వర్షపు నీరు నిల్వకుండా చూసుకోవాలి. వెదజల్లే పద్ధతిలో విత్తుకున్న పొలాలు, మడుల్లో నిలిచిన నీటిని వెంటనే తొలగించాలి. చిన్న మొలకలు అధిక నీటిని తట్టుకోలేవు. ప్రస్తుతం కలుపు మందులు వాడకుండా ఉంటే మంచిది. వర్షాలు కురిసే సమయంలో మందు పని చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. మరో రెండు రోజుల్లో వాతావరణం మామూలు స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు సూచించిన ప్రకారం ఎరువులు, కలుపు మందులు వాడుకోవచ్చు. ఇప్పటి వరకు నార్లు పోసుకోని రైతులు వర్షాలు తగ్గిన తర్వాత పోసుకుంటే మంచిది. ఇప్పటికే ఉన్న నారు మడులు వర్షాలు తగ్గిన తర్వాత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. నారు పండుబారి పేలవంగా కనిపించిన చోట పైపాటు ఎకరాకు సరిపడా నారు మడికి 1.5 నుంచి 2 కిలోల యూరియా వేసుకోవాలి. చెలెటెడ్ జింక్ 1 గ్రాము లేదా జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. వరి నారు మడి నారు తీసే వారం పది రోజుల ముందు తప్పనిసరిగా ఆర్బోఫారన్ 3జీ గులికలు 800 గ్రాములు ఎకరాలకు సరిపోయే రెండు గుంటల నారుమడికి వేసుకోవాలి.
పత్తి
నిల్వ నీటిని ప్రస్తుతం లేత దశలో ఉన్న పత్తి తట్టుకోలేదు. గండ్లు పెట్టి నీటిని చేనులోంచి తొలగించాలి. ఈ వానలకు అధికంగా కలుపు మొక్కలు వచ్చి పంటతో పోటీ పడే ప్రమాదం ఏర్పడుతుంది. వర్షం తగ్గిన తర్వాత పంట మీద పడకుండా కేవలం కలుపు మొక్కల మీద పడేలా డెమో అమర్చి పారాక్యాట్ క్లోరైడ్ 5 మిల్లీ లీటర్లకు లీటరు నీటిని కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత దశలో పైరిథియోబ్యాక్ సోడియం, క్విజాఫోప్ ఇథైల్ కలయిక మందు మాస్టర్ స్ట్రోక్ 450 మిల్లీ లీటర్లు ఎకరాలకు పిచికారీ చేసినట్లయితే వెడల్పాకు, గడ్డి జాతి కలుపును అదుపులో ఉంచవచ్చు. ఈ మందును కంది అంతర పంటగా ఉన్న పత్తిలో వాడవద్దు. వర్షాలు తగ్గిన తర్వాత బూస్లర్ డోస్గా ఎకరాకు 25-30 కిలోల యూరియా మొక్కల పక్కగా వేసుకోవాలి. పోషక లోప నివారణ కోసం 19-19-19 లీటర్ నీటికి 7.5 గ్రాముల ఫార్ములా 4- 2 గ్రాముల చొప్పున సూస్ప్రెడ్మాక్స్ 1 మిల్లీ లీటర్ కలిపి పిచికారీ చేయాలి. అక్కడక్కడా 3-4 ఆకుల దశలో ఉన్న పత్తిలో ఆకులపై రంధ్రాలు, ముడత కనిపిస్తుంది. ఇందుకు క్లోరిఫైరిపాస్ 20 ఈసీ, 2.5 మిల్లీ మీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాండానికి బొట్టు పెట్టే విధానాన్ని ఆచరించి 30 రోజుల దశలో ఉన్న పత్తిని ఆశించే రసం పీల్చే పురుగులను నియంత్రించ వచ్చు. ఇందుకు ఒక పాలు మోనోక్రొటోపాస్, నాలుగు పాల్లు నీళ్లు కలిపి లేదా కాండం భాగంలో అంగుళం మేర అంటించాలి.
మక్కజొన్న, ఇతరపంటలు
మక్కజొన్నలోనూ నిల్వ ఉన్న నీటిని తొలగించాలి. వర్షం తగ్గిన తర్వాత బూస్టర్ మోతాదుగా 53 కిలోల యూరియా 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. జింక్, బోరన్ లోపం కనిపిస్తే బోరాన్ 2 గ్రాములు, చెలెటెడ్ జింక్ 1 గ్రాము చొప్పున పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. కూరగాయ పంటలకు వర్షాల కారణంగా ఆకు మచ్చ కాండం కుళ్లు తెగుళ్లు ఆశిస్తాయి. కాపర్ ఆక్స్ క్లోరైడ్ 30 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పోషక లోప నివారణకు 13-0-45 లీటర్ నీటికి 10 గ్రాముల ఫార్ములా 4-2 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి.
అధికారుల సూచనలు తీసుకోండి
అధిక వర్షాల కారణంగా పంటలను రక్షించుకునేందుకు రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోండి. వారు చెప్పిన మందులు, ఎరువులను వాడి పంటలను రక్షించుకోండి. లైసెన్స్ కలిగిన దుకాణాల్లోనే మందులు కొని సరైన రసీదు పొందాలి. రైతులు నష్టపోకుండా ఉండాలంటే సరైన మెలకువలు, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు ఎప్పటికపుడు మా మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారుల నుంచి పొందండి. వారు సూచించిన విధింగానే చర్యలు చేపట్టి పంటలను అధిక వర్షాల నుంచి రక్షించుకోండి. ఎలాంటి సమాచారం కోసమైనా, సలహాలు, సూచనల కోసమైనా మీ పరిధిలోని అధికారులను సంప్రదించండి.
– వాసారెడ్డి శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి, కరీంనగర్