Sirikonda | సిరికొండ, జూన్ 9 : కర్ణాటక రాష్ట్రం బెంగుళూరులో ఈ నెల 11 నుండి 14 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి మేజర్ లీగ్ బేస్బాల్ కప్ ఇండియా –2026 పోటీలకు సత్యశోధక్ పాఠశాల జట్టు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం జట్టును అభినందించారు.గత ఏప్రిల్ నెల 23 నుండి 26 వరకు ఆర్మూర్ క్రీడా మైదానంలో నిర్వహించిన నిజామాబాద్ రీజినల్ ఉభయ రాష్ట్రాల మేజర్ లీగ్ బేస్బాల్ కప్ ఇండియా అండర్–11 ఛాంపియన్షిప్ పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచి గ్రూప్ బి విజేతగా నిలిచి ఛాంపియన్షిప్ను కైవసం చేసుకొని జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారని పేర్కొన్నారు.
పాఠశాలకు చెందిన హర్షిత్, సతీష్, శివచరణ్, శ్రీరామ్, సాయి సృజన్, అభిరామ్, విశ్వక్ సేనా, విధ్వాన్, రిషివరుణ్ తేజ్, రిశ్విత్, పి. రిత్విక్, టి. రిత్విక్ లు సభ్యులుగా, పాఠశాల పి.ఈ.టి. ఉపాధ్యాయులు బాదావత్ సంతోష్, దండు అనిల్ లు కోచ్, మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేందుకు బెంగుళూరుకు వెళ్తున్న సత్యశోధక్ పాఠశాల జట్టు విద్యార్థులను మంగళవారం పాఠశాలలో ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య అభినందించారు. గ్రామీణ ప్రాంతం నుండి జాతీయ స్థాయి వేదిక వరకు చేరుకోవడం గొప్ప విజయమని, విద్యార్థులు తమ క్రీడా ప్రతిభ, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తితో అత్యుత్తమ ప్రదర్శన చేసి విజయం సాధించుటకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పీఈటీలు అనిల్, సంతోష్, విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.