కరీంనగర్ విద్యానగర్, ఫిబ్రవరి 29: శాతవాహన న్యూరో డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజులపాటు న్యూరో వైద్యుల 8వ రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నామని కమిటీ చైర్మన్ డాక్టర్ ఎం రమణారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ జొన్నల శ్రీనివాస్, సైంటిఫిక్ కమిటీ చైర్ పర్సన్ డాక్టర్ పీవీకే కిశోర్ తెలిపారు. కరీంనగర్‌లోని సుభాష్‌నగర్‌లో ఉన్న భద్రకాళి దవాఖానలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సదస్సుకు సంబంధించి వోచర్‌ను వారు విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. శుక్రవారం కరీంనగర్ శివారులోని వీ కన్వెన్షన్‌లో సదస్సు ప్రారంభవుతుందని, 3వ తేదీ వరకు ఉంటుందని తెలిపారు. ఈ సదస్సు న్యూరో వైద్య విద్యార్థులతోపాటు జూనియర్ వైద్యులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి నిష్ణాతులైన వైద్యులు పాల్గొని న్యూరో విభాగంలో వస్తున్న ఆధునాతన పద్ధతులు, వైద్య విధానాలు, అత్యాధునిక ఆపరేషన్ల విధానంపై వివరిస్తారని తెలిపారు.
ఇదే రోజు రెనే దవాఖానలో బ్రెయిన్ ట్యూమర్ అంబర్ డిస్ సర్జరీలను సదస్సులో లైవ్‌గా చూపిస్తారని తెలిపారు. చల్మెడ మెడికల్ కాలేజీలో మెదడు, వెన్నెముక నరాల సమస్యలపై వచ్చిన అధునాతన వైద్య పద్ధతుల గురించి తెలియజేస్తారని చెప్పారు. 2న సాయంత్రం నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. 3న సదస్సు ముగింపు ఉంటుందని, వైద్యులు, వైద్య విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.