కరీంనగర్ : బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం అందరికీ ఆదర్శప్రాయమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి కమలాకర్ అన్నారు.శనివారం కరీంనగర్ పట్టణం సప్తగిరి కాలనీ సేవాలాల్ మందిరంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ అనునిత్యం బంజారాల అభివృద్ధి కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి సేవాలాల్ అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సంత్ సేవాలాల్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్(kcr) చిత్తశుద్ధితో పని చేస్తున్నారని పేర్కొన్నారు. జంతు హింస వద్దని, హిందూ ధర్మం కోసం దేశమంతా ప్రచారం చేసిన మహనీయుడని కొనియాడారు. సేవాలాల్ మందిరం, భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 30 లక్షల కేటాయించిందని ప్రొసీడింగ్స్ కాపీని బంజారా నాయకులకు అందజేశారు.
ఇంకా అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి తెచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. బంజారాలు నిర్వహించిన హోమం కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరి శంకర్, కార్పొరేటర్ దిండిగాల మహేశ్, చింతకుంట ఎంపీటీసీ తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.