మానకొండూరు : కాంగ్రెస్(Congress) ప్రభుత్వం బీసీలకు(BCs) ఇచ్చిన 42% వాటా అమలయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం బీసీ ఆజాది ఫెడరేషన్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి మనసు మార్చాలని కోరుతూ కొత్తగట్టు శ్రీ మత్స్య గిరీంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. తప్పులు తడకగా చేసిన కులగణన సర్వేను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీల వాటాను పెంచకుండా మోసం చేసే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను నిరసిస్తూ త్వరలో పల్లెబాట నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట ఫెడరేషన్ బాధ్యులు చిలకమర్రి శ్రీనివాస్, లక్ష్మీ రావు, గజవెల్లి మనోహర్, తాడూరి మల్లేష్, కదిరే కొమరయ్య ఉన్నారు.