జగిత్యాల, జూలై 11, (నమస్తే తెలంగాణ): వృత్తి రీత్యా వెన్నెముక శస్త్ర చికిత్స నిపుణుడైన సంజయ్ కల్వకుంట్ల, ప్రజాసేవపై మక్కువతో ప్రజాజీవితంలోకి అడుగుపెట్టారు. ఉచిత వైద్య శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన ఆయన, మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి విజయం అందుకున్నారు. గెలుపుతో ఒక మెట్టుపైకి ఎదిగినా.. తాను మాత్రం మరింత అందుబాటులో ఉంటున్నారు. ఇంటి వద్ద ఉన్నా.. పర్యటనలో ఉన్నా.. ఎక్కడ ఉన్నా తక్షణమే స్పందిస్తున్నారు. తన వద్దకు వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగానే కాదు, ఒక వైద్యుడిగా అనారోగ్య బాధితులకు భరోసా ఇస్తున్నారు. రెండు రోజుల క్రితం మెట్‌పల్లిలోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి పరిశీలించగా.. ఆయన ప్రజాసేవలో లీనమై కనిపించారు. ఉదయం 8.45 గంటలకే ప్రజలు ఎమ్మెల్యే ఇంటికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హాల్లో ముందు మూడు వరుసల్లో జనం కూర్చున్నారు. మూడో వరుసలో 25మంది పాతికమంది వరకు కూర్చొని ఉన్నారు.
9 గంటలకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల హాల్లోకి వచ్చారు. ఆయన వస్తూనే మూడో వరుసలో కూర్చున్న వారి వద్దకు వచ్చి మాట్లాడారు. వారంతా అనారోగ్య సమస్యలతో వచ్చినట్టు గుర్తించారు. ఇబ్రహీంపట్నం మండ లం తిమ్మాపూర్‌కు చెందిన బోడ రాజు వెన్నునొప్పితో బాధపడుతున్నానని చెప్పగా, ఆమె రిపోర్టులు, ఎక్స్‌రేలు పరిశీలించి మందులు రాసిచ్చారు. అలాగే, మెట్‌పల్లికి చెందిన షేక్ సల్మాన్ రెండు మోకాళ్లకు గాయాలయ్యాయని చెప్పగా, రిపోర్టు పరిశీలించారు. గాంధీ దవాఖానలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్‌తో మాట్లాడి సల్మాన్‌కు శస్త్ర చికిత్స చేయాలని విన్నవించారు. తర్వాత జగిత్యాలకు చెందిన బొల్లారపు లక్ష్మయ్య ఫ్రోజోన్ షోల్డర్ సమస్యతో రాగా, చేతిని పరీక్షించారు.
శస్త్రచికిత్స చేయించుకోవాలని, యశోదలో ఉన్న తన స్నేహితుడైన డాక్టర్ నితిన్ వద్దకు వెళ్లాలని సూచించారు. ఆ వెంటనే నితిన్‌తో ఫోన్లో మాట్లాడి, లక్ష్మయ్యకు ఆపరేషన్ అవసరమని, ఫీజులో 50 శాతం వరకు రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇలా మొత్తం 25 మందిని ఓపికగా పరీక్షించి, మందులు రాసి ఇచ్చి, వారి సమస్యలకు పరిష్కారం చూపారు. తర్వాత మిగిలిన ప్రజలతో సాధారణ సమస్యలపై చర్చించారు. సైబర్ మోసంపై మహిళ రాగా.. సీఐ తో ఫోన్లో మాట్లాడి న్యాయం చేయాలని సూచించారు. అలాగే, మురుగు కాలువ విషయమై వచ్చిన గ్రామస్తులందరినీ సముదాయించి సమస్య పరిష్కారంపై చర్చించారు.
కొడుకు, కోడలిని కోల్పోయానని, ఇద్దరు మనుమలకు దారి చూపాలని అడిగిన వృద్ధురాలికి సహాయం చేయడంతోపాటు మనుమల చదువు కోసం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌తో చర్చించారు. ఇలా ఎమ్మెల్యే దాదాపు 2 గంటలపాటు సమయం కేటాయించి, పరిష్కారం కోసం అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులతో ఫోన్లో మాట్లాడారు. కాగా, ఒక వైపు వైద్యం, మరో వైపు ప్రజా సమస్యల పరిష్కారంతో రెండు విధాలుగా ప్రజల కోసం తపిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్లను ప్రజలు ప్రశంసిస్తున్నారు. ప్రజల మన్నన పొందాలంటే సంజయ్ సారే నిదర్శనమని కొనియాడుతున్నారు.
నాకు ప్రజాసంక్షేమం, అభివృద్ధి ముఖ్యం. నేను బేసిక్‌గా వైద్యుడిని. ప్రజాప్రతినిధిగా సేవ చేసే అదృష్టం భగవంతుడు కల్పించాడు. వైద్యసేవ చేసే అవకాశం తల్లిదండ్రులు కల్పించారు. ఎంత వీలైతే అంత ఎక్కువ ప్రజలకు ఉపయోగపడుదాం. సేవ చేద్దాం. ప్రజాసేవ చేయాలంటే అధికార పార్టీలో ఉండాలన్న రూలేం లేదు. మనుసులో సంకల్పం ఉండాలే గానీ ఎక్కడ ఉన్నా ప్రజలకు సేవ చేయచ్చు.
– డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, కోరుట్ల ఎమ్మెల్యే