Sanitation worker | ఎల్లారెడ్డిపేట, జూలై 21: దుమాలలో 20 ఏండ్లుగా గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తూ ఇటీవల అనారోగ్యానికి గురై హాస్పిటల్‌కు వెల్లగా లివర్ సంబంధిత వ్యాధిగా తేలింది. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇంటి వద్దే ఉండిపోయి చికిత్స చేయించుకునేందుకు దాతల సాయం కో ఎదురుచూస్తున్నాడు. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దుమాలకు చెందిన కురుకుంట్ల వినోద్ కుమార్ భార్య లత, కూతురు సహస్ర(11), కుమారుడు సాత్విక్తేజ్(8)తో అద్దె ఇంటిలో ఉంటున్నాడు.
గత 20 ఏండ్లుగా గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇటీవల జ్వరంతో పాటు కాల్లు వాపులు రావడంతో మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెల్లి వైద్య పరీక్షలు చేయించుకోగా లివర్ సంబంధిత వ్యాధిగా తేలింది. తాత్కాలికంగా మందులు రాయించుకుని ఇంటికి చేరుకున్నాడు. పెద్ద హాస్పిటల్‌కు వెల్లేందుకు చేతిలో డబ్బులు లేక పోవడంతో ఇంటి వద్దే ఉండిపోయాడు. సదరు సమాచారాన్ని మాజీ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావుకు తెలియడంతో తన వంతు సాయంగా రూ.5వేలు అందించాడు. చికిత్స చేయించుకునేందుకు దాతలు సాయం చేయాలని వినోద్‌కుమార్-లత దంపతులు చేతులెత్తి వేడుకున్నారు. సాయం అందించాలనుకునే వారు ఫోన్‌పే 9963105099నంబర్ కు పంపాలని గ్రామస్తులు కోరుతున్నారు.