Sanitation vehicle drivers | కోరుట్ల, జూలై 19: కోరుట్ల మున్సిపాలిటీలో పారిశుధ్య వాహన డ్రైవర్లకు పాత పద్ధతిలోనే విధులు కేటాయించాలని బీఆర్ఎస్ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ పహీం పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రవీందర్ కు ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి శనివారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్త సేకరణ ఆటో డ్రైవర్లకు యథావిధిగా విధుల్లో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పట్టణంలోని 33 వార్డులకు సంబంధించి చెత్త సేకరించే ఆటో డ్రైవర్లను ఇతర వార్డులకు బదిలీ చేయడం వల్ల కొత్త వార్డులలో డ్రైవర్లకు సరైన అవగాహన లేక చెత్త సేకరణకు ఇబ్బందులు కలుగుతాయన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు పారిశుద్ధ్య లోపంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.
చెత్త సేకరణ విషయంలో ఆరు సంవత్సరాలుగా పూర్తి అవగాహన కలిగిన డ్రైవర్లను తిరిగి అదే వార్డులో కొనసాగించి వార్డులలో చెత్త సేకరణ పనులు యధా విధిగా జరిగేలా సహకరించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని అందించినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్లు సజ్జు, పేర్ల సత్యం, నాయకులు మురళి, వాసిక్, ఆనంద్ చిత్తారి, అస్లం, అర్బాజ్, ఇమ్రాన్, ఉమార్ తదితరులు పాల్గొన్నారు.