Sand quarry | వీణవంక, జూలై 9 : ఇసుక క్వారీ యాజమాన్యం, ఇరిగేషన్ అధికారులు కుమ్మక్కై కుంటలో నుండి రోడ్డు వేసి ఇసుక లారీలు నడిపిస్తున్నారని హిమ్మత్‌నగర్ గ్రామస్తులు ఆరోపించారు. ఈ సందర్భంగా హిమ్మత్‌నగర్ గ్రామస్తులు బుధవారం ఇసుక క్వారీ నిర్వాహకులు, ఇరిగేషన్ అధికారులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై తిరుపతికి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని కొండపాక, హిమ్మత్‌నగర్ గ్రామాలు రెండూ ఒకే రెవెన్యూ గ్రామం కిందికి వస్తాయని, అయినప్పటికీ కేవలం కొండపాక గ్రామస్తులే ఇసుక లారీలకు పరదాలు కడుతూ ఉపాధి పొందుతున్నారని తెలిపారు.
గ్రామ శివారులో గల నల్లకుంటను పూడ్చివేసి, అందులో నుండి దారి వేసి అడ్డదారి గుండా కొండపాక నుండి హిమ్మత్‌నగర్ మీదుగా రోజుకు వందల లారీలు వెళ్తున్నాయని పేర్కొన్నారు. దీని వల్ల రోడ్డు గుంతలు పడుతుండగా, దుమ్ము దూళితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. క్వారీ నిర్వాహకులు, ఇరిగేషన్ అధికారులు కుమ్మక్కై తీవ్ర నష్టం చేస్తున్నారని అన్నారు. లారీలకు తాటిపత్రిలు కట్టే అవకాశం హిమ్మత్‌నగర్ గ్రామస్తులకు కల్పించడంతో పాటు నల్లకుంట మీదుగా లారీలు పోకుండా ఆపాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్యలు పరిష్కరించే వరకు నేటి నుండి హిమ్మత్‌నగర్ గ్రామ పంచాయతీ ముందు రిలే నిరాహారదీక్ష చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మారం తిరుపతిరెడ్డి, జే శ్రీకాంత్, గెల్లు మల్లయ్య యాదవ్, సమ్మయ్య, నల్ల తిరుపతిరెడ్డి, కే రమేష్, నల్ల కొండాల్ రెడ్డి, ఎల్ రాజు తదితరులు పాల్గొన్నారు.