Salute to the mother | కోల్ సిటీ, జూలై 5: పిల్లల పుట్టిన రోజున తల్లిదండ్రులు ఆనందంతో విందులు, వినోదాలతో ఆర్భాటాలు చేయడం సహజం. కానీ, గోదావరిఖని పవర్ హౌజ్ కాలనీకి చెందిన ఓ మాతృమూర్తి తన కూతురు పుట్టిన రోజున అపురూప కానుక ఇవ్వాలని తలచింది. తన మరణానంతరం నేత్ర, అవయవదానం చేయడానికి నిర్ణయించి ఆదర్శమూర్తిగా పలువురి ప్రశంసలు అందుకుంది.
అంతేగాక తన తల్లి తీసుకున్న నిర్ణయం చూసి ఆమె కుమారుడు సైతం తల్లి అడుగుజాడల్లోనే అవయవదానం చేయాలని అంగీకారం ప్రకటించారు. గోదావరిఖని పవర్ హౌజ్ కాలనీకి చెందిన కాంపెల్లి ఆయ, ఆమె కుమారుడు శివ గణేష్ స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకొని శభాష్ అనిపించుకున్నారు. జయ కుమార్తె సుప్రియ పుట్టిన రోజున శనివారం తల్లి జయతోపాటు సోదరుడు శివ గణేష్ లు మరణానంతరం నేత్ర, అవయవాలను దానం చేయడానికి అంగీకారం ప్రకటించారు.
తమ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, మహిళా ప్రతినిధురాలు శశికళలు ఆర్గాన్ డోనర్ కార్డులతో పాటు అభినందన పత్రాలను సమర్పించారు. కుటుంబ సభ్యులను ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, గౌరవ అధ్యక్షుడు సానా రామకృష్ణారెడ్డి. సలహాదారులు నూక రమేశ్, కార్యదర్శి భీష్మాచారి, ప్రచార కార్యదర్శి వాసు తదితరులు అభినందించారు