Salaries pending | చొప్పదండి, జూన్ 22: బీఆర్ఎస్ ప్రభుత్వంలో పల్లె ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఉచితంగా వైద్య సేవలందించేందకు పల్లె దవఖానాలను ఏర్పాటు చేశారు. పల్లె దవాఖానలు కాంగ్రెస్ పాలనలో నిర్వీర్యమయ్యాయి. నాణ్యమైన వైద్యసేవలందించడంలో విఫలమవ్వగా, పనిచేసే సిబ్బందికి వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రెండు నెలలుగా పెండింగ్ వేతనాలు ఇవ్వకపోవడంతో అవస్థలు పడుతున్నారు.
కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 139 పల్లె దవాఖానలు ఉన్నాయి. పల్లె దవాఖానలో పేద ప్రజలకు వైద్య సేవలందిస్తున్నాయి. ప్రతీ పల్లె దవాఖానలో మెడికల్ అధికారి, స్టాఫ్ నర్సు, సపోర్టింగ్ స్టాఫ్, వైద్యసిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. రెండు నెలలుగా వేతనాలు రాక కుటుంబాలను పోషించలేక ఇబ్బందులు పడుతున్నారు. పేద ప్రజల చెంతకు వైద్యమందించాలని నాటి బీఆర్ఎస్ సర్కార్ పల్లెల్లో పల్లెదవాఖానలు ఏర్పాటు చేసింది.
కేసీఆర్ అధికారంలో ఉన్న రోజుల్లో వాటిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండేది. సిబ్బంది వేతనాలు, కావాల్సిన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండేవి. కాంగ్రెస్ పదిహేను నెలల పాలనలో వైద్యరంగాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసింది పల్లె దవాఖానల్లో ప్రస్తుతం సరిపడా మందులు లేక, ప్రైవేట్ ఫార్మసీ లను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం. సిబ్బందికి వేతనాలు వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకు తిరుగుతుంది. గతంలో హరీశ్ రావు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వైద్యసిబ్బందితో నిత్యం సమీక్షలు నిర్వ హించి జీతభత్యాల గురించి తెలుసుకునేవారు.
ఒకవేళ సకాలంలో వేతనాలు రాకుంటే కారణాలు తెలుసుకొని అప్పటికప్పుడు పరిష్కరించేవారు. ప్రస్తుతమున్న ఆరోగ్యశాఖ మంత్రి వీటన్నంటికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. సిబ్బంది వేతనాలపై అధికారులకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోవడంతో పల్లె దవాఖానల్లో పని చేసే సిబ్బంది నిరాశకు గురవుతున్నారు.