తిమ్మాపూర్, జూన్ 22: అసలే చిన్నపిల్లలు.. వారిని తరలించేందుకు అన్ని అనుమతులు, నిష్ణాత్మలైన డ్రైవర్లు అవసరం. కానీ కొన్ని ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు మమ్మల్ని ఎవరేం చేస్తారని అనుకున్నారో ఏమో.. చిన్నపిల్లలను పాఠశాలలకు తరలించే స్కూల్ బస్సులకు (School Bus) ఫిట్నెస్ చేయించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. పాఠశాల ప్రారంభమై పది రోజులు అవుతున్నప్పటికీ అనేక సంఖ్యలో బస్సులు ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉంది. ఇందులో కొన్ని 15 సంవత్సరాల కాల పరిమితి దాటినమైనప్పటికీ వాటి యజమానులు రవాణా శాఖ అధికారుల వద్ద డిస్పోజల్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికీ పదుల సంఖ్యలో బస్సులు ఫిట్నెస్కు రాకుండా మొండికేస్తుండడంతో రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగి ప్రత్యేక తనిఖీలు చేస్తూ పాఠశాల బస్సులను పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. శనివారం ఉదయం కరీంనగర్ లోని తీగల గుట్టపల్లి వద్ద ఫిట్నెస్ ఇతర పత్రాలు లేకుండా పిల్లలను తరలిస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సును ఏఎంవీఐ స్రవంతి పట్టుకొని కేసు నమోదు చేసి తిమ్మాపూర్ లోని రవాణా శాఖ కార్యాలయం తరలించారు. అన్ని పాఠశాలల బస్సులు ఫిట్నెస్ పూర్తయ్యే వరకు తనికీలు నిర్వహిస్తూనే ఉంటామని హెచ్చరించారు. తనిఖీల్లో సిబ్బంది శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.