ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేంళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఆర్టీసీ యూనియన్లు మండిపడుతున్నాయి. గతంలో ఇచ్చిన 21 డిమాండ్లలో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడంతో ఉద్యోగులు ప్రభుత్వంతో అమీతుమీకి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 24న చలో సెక్రటేరియట్ కార్యక్రమం చేపట్టి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయబోతున్నారు. శాంతియుతంగా సాగే తమ ఉద్యమాన్ని అణచివేసే కుట్రలు చేస్తే జైలో భరోకైనా సిద్ధమని సమరానికి సై అంటూ ఆర్టీసీ జేఏసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.
కరీంనగర్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం ఆగం పట్టిస్తున్నదా? ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ప్రజా రవాణా సం స్థను మూసివేసే కుట్రలు జరుగుతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి ఈ సంస్థలోని ఉద్యోగ సంఘాలు. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ రెం డున్నరేళ్లయినా ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తక పోవడంతో ఆర్టీసీ జేఏసీ మండిపడుతోంది. పైగా ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశ పెట్టి సంస్థ ను ప్రైవేట్ పరం చేసే కుట్రలు చేస్తున్నదని సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో తమను మభ్య పెట్టి తమ ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై ఆర్టీసీ ఉద్యోగుల అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేకసార్లు వి న్నపాలు, విజ్ఞప్తులు చేసినా తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని, ఇప్పటికీ రెండు సార్లు సమ్మెకు దిగేందుకు ప్రయత్నించినా హా మీలు నెరవేర్చుతామని చెప్పిన ప్రభుత్వం త మను మోసం చేసిందని యూనియన్ నాయకులు మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీని బతికించుకుంటారా.. ఆగం పట్టిస్తారా? తేల్చి చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఆర్టీసీలో ప్రవేశ పెట్టిన ఎలక్ట్రికల్ బస్సులపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రైవేట్ సంస్థల గుత్తాధిపత్యంలో నడిచే ఈ బస్సుల వల్ల ప్రయాణికులకుగానీ, సంస్థకుగానీ ఎలాంటి ప్రయోజనాలు కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ బస్సుల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు ఆర్టీసీకి సంబంధం లేదని, ఈ బస్సులపై ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ మొత్తం ప్రైవేట్ వ్యక్తులకే చెందుతోందని, ఒక్కో బస్సుపై ఇస్తున్న రూ.36 లక్షల సబ్సిడీని ప్రైవేట్ వ్యక్తులకే కట్టబెడుతున్నారని ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహిస్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీయే తీసుకుని నడపాలని డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల తర్వాత కాలంలో ఆ బస్సులు సంస్థకే చెందుతాయనేది ఉద్యోగుల భావన. ఎలక్ట్రికల్ బస్సులపై ప్రైవేట్ గుత్తాధిపత్యం ఉండరాదని భావిస్తున్నారు. ఈ బస్సుల ప్రవేశంతో తమకు ఉద్యోగ భద్రత కరువవుతోందని వాపోతున్నారు. ఎలక్ట్రికల్ బస్సులకు కిలోమీటర్‌కు రూ.58 ఇవ్వడం వల్ల కొన్ని రూట్లలో ఆర్టీసీ నష్టపోయే ప్రమాదం ఉంటుందని కార్మికులు వాపోతున్నారు. అంతే కాకుండా, ఎలక్ట్రికల్ బస్సులకు అనేక డిపోలను ధారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆసక్తిగా కనిపిస్తోందని, ఈ విధానం ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పెంచి సంస్థ ఉద్యోగులను తగ్గించే కుట్రలు జరుగుతున్నాయని వాపోతున్నారు. ఇదే జరిగితే ఆర్టీసీ మనుగడకు పెను ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత పదేళ్లలో ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేక పోవడంతో ఉద్యోగులపై విపరీతమైన పని భారం పెరిగిందని, సంస్థలో ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత ఉన్నవారితోనే పనిచేయిస్తున్నారని, పని భారం తట్టుకోలేక ఆర్టీసీ కార్మికులు అనారోగ్యంతో రెఫరల్ దవాఖానల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు యాజమాన్యం వేధింపులు రోజు రోజుకూ పెరుగుతున్నాయని కార్మికులు వాపోతున్నారు. 14 నుంచి 16 గంటలు డ్యూటీ చేయిస్తూ తమపై భారాన్ని మోపుతున్నారని ఆవేదన చెందుతున్నారు. పదేళ్లుగా కార్మికులకు రావాల్సిన ఎన్‌క్యాష్‌మెంట్ ఇంత వరకు చెల్లించలేదని, కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అవస్థలు పడుతున్నా యాజమాన్యం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. 2024 నుంచి రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులు, కార్మికులకు గ్రాట్యుటీ చెల్లించ లేదని, గడిచిన ఐదేళ్లుగా కార్మికులకు యూనిఫాం కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. కొత్తగా నియామకాలు లేక పోవడంతో డ్రైవర్లు, కండక్టర్లపై తీవ్రమైన పని భారం పెరిగి గుండె పోట్లకు, అధిక రక్తపోటుకు గురై నేలరాలుతున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఆర్టీసీని ఆధునీకరిస్తామని చెప్పిన ప్రభుత్వం రెండున్నరేళ్లలో ఒక్క సంస్కరణ కూడా చేయలేదని, కనీసం ఉన్న ఖాళీలనైనా భర్తీ చేయడం లేదని వాపోతున్నారు. ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతున్నా పట్టించుకోవడం లేదని, మహాలక్ష్మి పథకం కింద మహిళలు, దివ్యాంగులు, జర్నలిస్టులకు కల్పిస్తున్న రాయితీ చార్జీలను రీ ఎంబర్స్మెంట్ చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీని కాపాడుకునే లక్ష్యంతోనే తాము ఆందోళన బాట పట్టాల్సి వస్తోందని ఆర్టీసీ జేఏసీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని బీఆర్ఎస్ హయాంలో చేసిన చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కి పెడుతున్నదని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు మండి పడుతున్నారు. ఈ చట్టాన్ని అమలు చేస్తారా.. రద్దు చేస్తారా? అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని ఆగ్రహిస్తున్నారు. ఒక పక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలన్నింటినీ చెల్లిస్తామని తన మేనిఫెస్టోలో స్పష్టం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సుల పేరిట ప్రైవేట్ పరం చేయాలని కుట్రలు చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాల్లో నడుస్తున్నాయని విద్యుత్ సంస్థలకు గత బడ్జెట్లో పెద్ద మొత్తంలో కేటాయింపులు చేసిన ప్రభుత్వం ఆర్టీసీకి మాత్రం ఇక్క పైసా కేటాయించలేదని వాపోతున్నారు. ఉద్యోగులకు మూడు పీఆర్సీలను ఇప్పటి వరకు అమలు చేయకపోవడాన్ని ఆర్టీసీ జేఏసీ నాయకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన ప్రభుత్వం తమను తప్పదోవ పట్టించి సంస్థను నాశనం పట్టించేందుకు కుట్రలు చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. గతంలో ఇచ్చిన 21 డిమాండ్లతోపాటు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.
ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కాపాడుకుంటాం. ఇది వరకు అనేక సార్లు ప్రభుత్వానికి, యాజమాన్యానికి విజ్ఞప్తులు చేశాం. కానీ, ఏ మాత్రం స్పందన కనిపించడం లేదు. మేం ప్రభుత్వానికి వ్యతి రేకం కానేకాదు. కానీ, మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్నాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకా ఉపేక్షిస్తే సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీని చిన్న చూపు చూస్తోంది. నష్టాల్లో ఉన్న వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. రూ.2,350 కోట్ల అప్పులున్న ఆర్టీసీకి మాత్రం బడ్జెట్లో కేటాయింపులు జరుపలేదు. ఆర్టీసీని ఆధునీకరిస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో అనేక బస్సు డిపోలను ధారాదత్తం చేయాలని చూస్తోంది. ఇదే జరిగితే ఆర్టీసీ మనుగడకు ముప్పు తప్పదు. మా పోరాటం కేవలం మా ప్రయోజనాల కోసమే కాదు సంస్థను కాపాడుకునేందుకు కూడా. ఈ నెల 24న తలపెట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి ప్రతి రీజియన్ నుంచి కార్మికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇందిరా పార్క్ నుంచి సెక్రటేరియట్ దాకా ర్యాలీగా వెళ్లి మా డిమాండ్లను వినిపిస్తాం. ఇందుకు పోలీసు అనుమతులు కూడా తీసుకుంటున్నాం. కార్మికులు నిర్భయంగా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా.
– మారంరెడ్డి థామస్ రెడ్డి, టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్