తెలంగాణ చౌక్, ఏప్రిల్ 21: ‘నేను నా ఉద్యోగంలో రాణిస్తా’ నినాదంతో ఏప్రిల్ చాలెంజ్ ఇన్ ట్రైనింగ్ కార్యక్రమం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు శిక్షణ నిస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు అన్ని డిపోల పరిధిలోని కండక్టరలకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రతి డిపోలో 30 మందిని ఒక గ్రూప్‌గా ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు.
డిపో కండక్టర్ల సంఖ్య బట్టి గ్రూపులుగా విభజించి శిక్షణ ఇవ్వనున్నారు. జోనల్ పరిధిలో ఉన్న 1643 మందికి 30 మంది చొప్పున శిక్షణకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు శిక్షణ కొనసాగనుంది. శిక్షాణార్థులకు భోజనం ఏర్పాటు చేశారు. ప్రతి ఉద్యోగికి 200 చొప్పున అలవెన్స్ అందించనున్నారు. శిక్షణలో సంస్థ రూపొందించిన డాక్యుమెంటరీలను ప్రదర్శించనున్నారు. రీజియన్ పరిధిలోని 11 డిపోలలో శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు.
మెరుగైన సేవలందించేందుకే
ప్రయాణికులను సంఖ్య పెంచుకోవడంతో పాటు వారికి మరింత మెరుగైన సేవలందించేందుకే ఎండీ సజ్జనార్ ఆదేశాలతో ట్రాక్ట్ పేరుతో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రీజియన్ పరిధిలోని 11 డిపోల్లో శిక్షణ ప్రారంభించాం. సంస్థాగత పనితీరును సంస్థ అధికారులు వివరిస్తారు. ఆదాయం, ప్రయాణికులతో మర్యాదగా ఎలా వ్యహరించాలని అనే అంశాలపై బ్యాంక్, ఎల్ఐసీ అధికారులు వివరిస్తారు. ప్రయాణికుల మన్నల పొందడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది.
– ఖుస్రోషాఖాన్, ఆర్ఎం కరీంనగర్
ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు
గ్రామీణ ప్రాంత ప్రయాణికుల సంఖ్య పెంచుకునేందుకు శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రయాణికులతో కలుపుగోలుగా ఉండాలని చెబుతున్నాం. చెయ్యెత్తిన చోట బస్సు ఆపాలని, వారు కోరుకున్న చోట దింపాలని సూచిస్తున్నాం. రూట్లో వెళ్తున్న సమయంలో పాయింట్ల వద్ద బస్సును రెండు నిమిషాలను నిలిపి బస్సు రూట్ బిగ్గరగా చెప్పి ప్రయాణికులను తీసుకెళ్లాలి. కండక్టర్లకు ఇస్తున్న శిక్షణ సంస్థ ఆదాయాన్ని గండించేందుకు ఎంతో ఉపయోగపడుతుంది.
– ప్రణీత్, డిపో-1 మేనేజర్ (కరీంనగర్)