బల్దియా ఆదాయానికి భారీగా గండి కొట్టి.. టెండర్లు దక్కించుకునేందుకు కొంత మంది కాంట్రాక్టర్లు పన్నిన వ్యూహం బెడిసికొట్టింది. సింగిల్ టెండర్లతో రూ.50 కోట్ల పనులు కట్టబెట్టేందుకు భారీగా వసూలు చేసిన డబ్బుల వ్యవహారం చిచ్చురేపింది. ఫలితంగా విషయం బయటకు పొక్కగా, పలువురు కాంట్రాక్టర్లే ఈ అక్రమ తంతుపై ఏకంగా వివిధ శాఖలకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఒక్కసారిగా రింగ్ వ్యవహారం బహిర్గతం కావడంతోపాటు అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారయంత్రాగం.. సదరు పనులను రద్దు చేస్తూ.. తిరిగి రీకాల్ చేస్తున్నట్లుగా ప్రకటించాల్సిన అగత్యం ఏర్పడింది.
కరీంనగర్ కార్పొరేషన్, మే 30 : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో రూ.50 కోట్ల వ్యయంతో చేపట్టాలని నిర్ణయించిన అభివృద్ధి పనుల విషయంలో ఆది నుంచీ వివాదాలే ఎదురవుతున్నాయి. నిజానికి మున్సిపల్ ఎన్నికలకు ముందు శివారు ప్రాంతాల అభివృద్ధి కోసం యూఐడీఎఫ్ కింద రూ.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఆ మేరకు అప్పుడే అధికారులు టెండర్లు నిర్వహించారు. అయితే, వాటిని ఓపెన్ చేసి కాంట్రాక్టర్లకు అప్పగించడంలో అధికారులు ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేశారు. దీంతో నూతన పాలకవర్గం ఏర్పాటు కాగానే.. కొంత మంది సభ్యులు చక్రం తిప్పారు. గత మార్చిలో జరిగిన ఈ వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలను ఇచ్చిన విషయం తెలిసిందే. అయినా, పాలకవర్గం గత టెండర్లను రద్దుచేసి అవే నిధులతో శివారు కాలనీలే కాకుండా నగరంలోని వివిధ ప్రాంతాల్లోనూ పను లు చేపట్టేందుకు సర్కా రు నుంచి అనుమతి సంపాదించింది.
ఆ మేరకు నూతనంగా 87 పనులకు ఈ నెలలో టెండర్లు నిర్వహించారు. ఈ నెల 19 వరకు ఆన్లైన్లో టెండర్లు దాఖలు చేసేందుకు గడువు విధించారు. ఇందులో కొంత మంది కాంట్రాక్టర్లు ఒక సమూహంగా ఏర్పడి కొంత మంది పాలకవర్గ సభ్యుల ఆదేశాల మేరకు చక్రం తిప్పినట్లుగా విమర్శలు వస్తున్నా యి. అంతేకాదు.. మెజార్టీ పనులకు కేవలం సింగిల్ టెండర్ మాత్రమే వచ్చేలా ముందస్తుగా అంగీకారం కుదిర్చి టెండర్లు దాఖలు చేయించారని తెలుస్తోంది.
అయితే, సింగిల్ టెండర్ ద్వారా పనులు కావాలి అని కోరుకునే కాంట్రాక్టర్ల నుంచి.. చక్రం తిప్పిన వ్యక్తులు ఒక శాతం డబ్బును ముందుగా స్వాధీనం చేసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అంటే ఆ లెక్కన దాదాపు రూ.50 కోట్లకు రూ.50 లక్షలు వసూలు చేసి.. పంపకాలు కూడా చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం బయటకు పొక్కడంతో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో కొంత మంది కాంట్రాక్టర్లు.. వారివారి బంధువులు ఇతరుల పేరుతో రూ.50 కోట్ల టెండర్లలో జరిగిన అక్రమాలు, డబ్బుల వసూళ్లు, ముందుగా డిపాజిట్ చేయించుకున్న తీరు వంటి అంశాలపై విజిలెన్స్, ఏసీబీతోపాటు రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాలశాఖలోని అన్ని ప్రధాన విభాగాలకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన కొన్ని కాపీలు బయటకు కూడా వచ్చాయి. అయితే.. బయటకు రానివి కూడా చాలా ఉన్నట్లుగా తెలుస్తోంది.
రూ.50 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల టెండర్లు వివాదం కావడం.. మెజార్టీ పనులకు సింగిల్ టెండర్లు రావడం.., ఇందులో జరిగిన అక్రమాలు, సిండికేట్లు, డబ్బుల వసూళ్ల వంటి వాటిపై ఫిర్యాదుల పరంపర వెల్లువెత్తడం.., జిల్లా నుంచి రాష్ట్రస్థాయి శాఖల వరకు లిఖిత పూర్వక ఫిర్యాదులు వెళ్లడంతో అధికారయంత్రాగం అప్రమత్తమైంది. ఈ వివాదం మరింత ముదిరితే అసలుకే ఎసరు వస్తుందని భావించిన అధికారులు మెజార్టీ టెండర్లను రద్దు చేశారు. ఆ మేరకు 87 పనులకు 71 పనులకు రీకాల్ టెండర్లు నిర్వహిస్తున్నట్లు నగరపాలక ఎస్ఈ రాజ్‌కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. టెండర్ల దాఖలుకు వారం రోజుల గడువు ఇవ్వనున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. మొత్తం మీద సిండికేట్ వ్యవహారం బెడిసికొట్టడంతో.. డబ్బుల వసూళ్ల వ్యవహారం మరింత ముదిరే అవకాశం ఉంటుందన్న చర్చ నడుస్తోంది. రీకాల్‌తో చాలా మంది కాంట్రాక్టర్లు వారి పనులను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఇచ్చిన డబ్బులను తిరిగి వసూలు చేసుకోవాలని పలువురు కాంట్రాక్టర్లు భావిస్తుండగా.. తీసుకున్నవి తిరిగి ఇస్తారా? లేదా? అన్నది మున్ముంది తేలనుంది.
నిజానికి టెండర్ల సిండికేట్ విషయంలో డబ్బులు వసూలుచేసిన సమూహం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లుగా అర్థమవుతోంది. నిజానికి మొత్తం పనులకు ఒకే టెండర్ వస్తే అనుమానాలు వ్యక్తమవుతాయని భావించి.. వాటిలో ముఖ్యమైన పనులకు సింగిల్ టెండర్ వేసేలా చూశారు. అక్కడితో ఆగకుండా సింగిల్ టెండర్ వస్తే.. అందులోనూ ఎస్ఎస్ఆర్ ధరకు మించి ఎక్సెస్‌గా ధర కోట్ చేసి టెండర్ దాఖలు చేస్తే రద్దు అయ్యే అవకాశాలుంటాయని గుర్తించిన సదరు వ్యక్తులు.. నిర్ధారించిన అంచనా రేటుకన్నా.. 0.01 శాతం తక్కువ ఉండేలా చూసి టెండర్ దాఖలు చేయించినట్లుగా తెలుస్తోంది. లెస్‌లో ఉన్నారు కాబట్టి.. టెండర్ రద్దు చేయడానికి అధికారులు వెనుకడుగు వేస్తారని, తద్వారా తమ వ్యవవహారం ఫలిస్తుందని భావించారని విశ్వసనీయ సమాచారం. నిజానికి గతంలో బల్దియాలో జరిగిన వివిధ అభివృద్ధి పనులకు టెండర్లను చూస్తే.. 10 నుంచి 15 శాతానికి పైగా లెస్‌కు టెండర్లు దాఖలయ్యాయి. సిండికేట్ కాకుండా ఉండి ఉంటే.. ఈసారి కూడా అలానే జరిగేవి. తద్వారా బల్దియాకు దాదాపు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఆదా ఆయ్యేవి.