కరీంనగర్ రైస్‌మిల్లు అసోసియేషన్‌లో భారీ అక్రమాలు జరిగాయా..? వివిధ కారణాలు, ఖర్చుల పేరిట మిల్లర్ల నుంచి వసూలు చేసిన 2 కోట్లు గోల్మాల్ అయ్యాయా..? బైలాకు విరుద్ధంగా అసోసియేషన్
నడుస్తున్నదా..? నిబంధనల ప్రకారం జనరల్‌బాడీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్‌లు పెట్టకుండా దాదాపు 17 నెలలుగా నిర్లక్ష్యం చూపారా..? ఈసీలో తీర్మానం చేయకుండానే మంత్రులు, నాయకులకు లక్షలు ఇచ్చినట్టు తప్పుడు లెక్కలు రాసి.. వచ్చిన డబ్బులను పక్కదారి పట్టించారా..? లెక్కలు అడిగితే దాటవేస్తున్నారా..? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. ఈ నెల 26న జరిగిన అసోసియేషన్ ఈసీ మీటింగ్‌లో సభ్యులు లేవనెత్తిన అంశాలు, చూపిన తప్పుడు లెక్కలు, బెదిరింపులు, బుజ్జగింపులు జరిగిన తీరు దీనికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుండగా.. ప్రస్తుతం ఈ వ్యవహారం రైస్‌మిల్లర్లలో హాట్‌టాపిక్‌లా మారింది. ఈ వేడి మరింత ఉధృతం అయ్యేలా కనిపిస్తున్నది. అంతేకాదు, ఈసీ సమావేశంలో జరిగిన బెదిరింపుల వ్యవహారాన్ని మిల్లర్లు తీవ్రంగా పరిగణిస్తుండగా.. మరోసారి ఈ తరహా ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడానికి నాయకత్వం హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది.
కరీంనగర్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :కరీంనగర్ రైస్‌మిల్ అసోసియేషన్‌లో కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధ వాతావారణం నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే రా రైస్ మిల్లర్లు నూతన సంఘంగా ఏర్పడినట్టు మిల్లర్లలో చర్చ జరుగుతున్నది. ఇదిలా ఉంటే ఈ నెల 26న మిల్లర్స్ భవన్లో అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈసీలోని కొంత మంది సభ్యులు.. అసోసియేషన్‌లో జరుగుతున్న వ్యవహారంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధానంగా బైలా ప్రకారం అసోసియేషన్ ఎందుకు నడుపడం లేదని నాయకత్వాన్ని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం ప్రతి రెండు నెలలకోసారి ఈసీ సమావేశం నిర్వహించి, అసోసియేషన్ పెట్టిన ఖర్చులు, వచ్చిన ఆదాయాలు, ఇతర అంశాలపై చర్చ జరగాలని, గడిచిన 17 నెలల్లో ఎన్ని సార్లు మీటింగ్ పెట్టారో చెప్పాలని నిలదీసినట్లుగా తెలుస్తున్నది. అలాగే వానాకాలం యాసంగి రబీ సీజన్లో అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశాలు పెట్టాల్సి ఉన్నా ఎందుకు నిర్వహించడం లేదని, దానికి కారకులెవ్వరని ధ్వజమెత్తినట్టు సమాచారం. అత్యవసర నిర్ణయాలు, లేదా ఇతర సమయాల్లోనూ.. ఈసీ మీటింగ్‌లు పెట్టి, ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా చర్చించి ఆమోదించిన తర్వాత మాత్రమే అమలు చేయాల్సిన అనేక అంశాలను కేవలం ఒకరిద్దరు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. అసలు సమావేశాలు పెట్టకుండా ఏక చక్రాధిపత్యం ఏమిటంటూ సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించడమేకాదు, నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారని మిల్లర్ల ద్వారా తెలుస్తున్నది. బైలా ప్రకారం సాగాల్సిన సమావేశాలు నిర్వహించకపోవడంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు.. నాయకత్వం సరైన సమాధానం చెప్పకపోవడంతో సభ్యులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని విశ్వసనీయ సమాచారం.
గడిచిన 18 నెలలుగా మిలర్స్ అసోసియేషన్ భవన్ పరిధిలో ఉన్న దుకాణా సముదాయాలకు వచ్చిన అద్దెలు, అలాగే వివిధ ఖర్చులు, మిల్లర్స్ నుంచి అసోసియేషన్ పేరిట వసూలు చేసిన డబ్బుల వ్యవహారంపై సమావేశంలో పెద్ద దుమారమే రేగినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. గత ప్రభుత్వం మిల్లర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సివిల్ సైప్లె కొనుగోలు చేసేలా అనుమతులు ఇప్పిస్తే.. అధికారుల ఖర్చులంటూ లారీకి 3వేల చొప్పున దాదాపు కోటికిపైగా వసూలు చేశారని, ఆ లెక్కలు చెప్పాలని సభ్యులు సూటిగా ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. దీంతో పాటు తమిళనాడుకు బియ్యం పంపినప్పుడు క్వింటాలుకు 5 చొప్పున ఖర్చుల కింద మిల్లర్ల నుంచి 40లక్షలకుపైగా వసూలు చేశారని, అలాగే నెలకు దాదాపు రెండు లక్షల అద్దెలు వస్తున్నాయని, వాటి వివరాలు ఎక్కడో చెప్పాలని నిలదీసినట్టు తెలుస్తున్నది.
ఇవేకాకుండా వివిధ సందర్భాల్లో ఖర్చుల కోసం వసూలు చేసిన అన్నీ కలిపి దాదాపు రెండున్నర నుంచి మూడు కోట్లకు లెక్కలు చెప్పాలని ప్రశ్నించడంతోపాటు 17నెలల లెక్కలు చూపాల్సిన చోట కేవలం పది నెలల ఆదాయ వ్యయ వివరాలు మాత్రమే, అదికూడా తప్పుడు తడకలుగా ఎందుకు చూపారని, అలాగే మిగిలిన నెలల లెక్కలు ఎందుకు చూపలేదో చెప్పాలని గట్టిగానే అడిగినట్టు తెలుస్తున్నది. దీంతో నాయకత్వం కొన్ని లెక్కలను ముందు పెట్టినట్టు తెలుస్తున్నది. అందులో కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉన్నతాధికారులకు లక్షల్లో ముడుపులు ఇచ్చినట్టు లెక్కలు చూపడంతో మరోసారి ఈసీ సభ్యులు భగ్గుమన్నారు. బైలా ప్రకారం కేవలం 5వేలవరకు మాత్రమే ఖర్చు పెట్టే అధికారం మిల్లర్స్ అసోసియేషన్ నాయకత్వానికి ఉందని, అలాంటప్పుడు లక్షల్లో ముడుపులు ఇవ్వాల్సి వస్తే ఈసీతో చర్చించాల్సిన అవసరం లేదా..? అని నిలదీసినట్టు తెలుస్తున్నది. 5వేల వరకే మీ పవర్ ఉండగా లక్షల్లో ఎలా ఇస్తారని? అందులో భారీ మొత్తంలో గోల్‌మాల్‌తోపాటు స్వాహా పర్వం సాగిందని సభ్యులు మండిపడ్డట్టు అసోసియేషన్ నాయకుల ద్వారా తెలుస్తున్నది.
5వేలకు మించి ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా ఈసీ సమావేశంలో చర్చించి తీర్మానం చేసిన తర్వాత మాత్రమే చెల్లించాలని బైలాలో స్పష్టంగా ఉన్నా ఇష్టానుసారం ఎలా వ్యవహరిస్తారని నిలదీసినట్టు సమాచారం. ఈ విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న సమయంలో బయట నుంచి ఓ మిల్లర్ నేరుగా ఈసీ మీటింగ్ జరుగుతున్న హాల్లోకి వచ్చి.. అక్కడున్న మిల్లర్లపై దుర్భాషలాడడంతోపాటు బెదిరింపులకు పాల్పడినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈసీ సభ్యలంతా ఒక్క తాటిపైకి వచ్చి, నాయకత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడంతోపాటు ఈసీ కాని సభ్యుడిని ఎలా అనుమతించారో చెప్పాలని ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. ఈ పరిస్థితులతో సమావేశం రసాభాసగా మారి.. తీవ్ర స్థాయిలో హెచ్చరికలు, బెదిరింపులకు వరకు వెళ్లిందని మిల్లర్లు చర్చించుకుంటున్నారు. ఒక దశలో పరిస్థితి అదుపు తప్పడంతో ఇతర నాయకులు జోక్యం చేసుకొని సద్దుమణిగేలా చేయడంతోపాటు మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్టు చర్చ జరుగుతున్నది. ఈసీ సభ్యులు ప్రశ్నించిన మేరకు 30 లక్షల వరకు అసోసియేషన్‌కు జమజరిగేలా చూస్తామని నాయకత్వం హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.
ఈసీ సమావేశంలో జరిగిన వివాదం, నిధులు పక్కదారి వంటి అంశాలు ప్రస్తుతం మిల్లర్స్ అసోసియేషన్‌లో హాట్‌టాపిక్ అయ్యాయి. ప్రస్తుతం ఏ నలుగురు మిల్లర్లు కలిసినా ఇదే అంశంపై చర్చ జరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో కొంత మంది మిల్లర్లు ఈసీకి పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వడంతోపాటు నిధుల గోల్మాల్ లెక్క తేలి, పారదర్శకంగా లెక్కలు చూపే వరకు ఇలాగే ముందుకెళ్లాలని ఈసీ సభ్యులను కోరినట్టు తెలుస్తున్నది. దీంతో ఈసీ సభ్యులు అసోసియేషన్ వ్యవహారాలు, వచ్చిన ఆదాయం , వివిధ ఖర్చుల పేరిట వసూలు చేసిన డబ్బులు, అధికారులకు ఇచ్చినట్టు చూపుతున్న అనాధిరిక లెక్కలు, బైలా విస్మరణ వంటి అంశాలను పూర్తిస్థాయిలో తేల్చాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి లెక్కలు తేలే వరకు.. మరింత లోతుగా వెళ్లాల్సిందే అన్న నిర్ణయానికి ఈసీలోని మెజార్టీ సభ్యులు రావడంతో ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశాలున్నాయని మిల్లర్లు చర్చించుకుంటున్నారు.