బీర్పూర్, ధర్మపురి మండలాల రైతుల కల నెరవేరింది. నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బీర్‌పూర్‌లోని రోళ్లవాగు ఆధునీకరణ పూర్తయింది. 0.25 టీఎంసీ సామర్థ్యం నుంచి టీఎంసీ సామర్థ్యానికి చేరుకున్న ఈ ప్రాజెక్టు, స్వరాష్ట్రంలో 136 కోట్ల నిధులతో పనులు పూర్తి చేసుకున్నది. రానున్న కాలంలో దాదాపు 20 వేల ఎకరాలకు సాగునీరు, 18 గ్రామాల ప్రజలకు తాగునీరు అందించనున్నది. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కొద్ది రోజుల క్రితమే రోళ్లవాగులోకి ఎస్సారెస్పీకి చెందిన డీ 53 కెనాల్ నుంచి నీటిని విడుదల చేసి, లాంఛనంగా ప్రాజెక్టును ప్రారంభించగా, రెండు మండలాల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
జగిత్యాల, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): రోళ్లవాగు ప్రాజెక్టు బీర్పూర్ అటవీ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ప్రాంతం. 45 క్రితం కొంత అభివృద్ధి చేసి, చిన్న ప్రాజెక్టుగా స్థిరీకరించారు. వేసవిలో నీటి లభ్యత లేని సమయంలో దీన్ని నీటితో నింపితే బాగుంటుందన్న ఆలోచనతో ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి డీ 53 కాలువను ఫీడర్ చానల్‌గా ఏర్పాటు చేశారు. 1989లో రోళ్లవాగును కొంత ఆధునీకరించి ప్రాజెక్టుకు రెండు స్లూయీజ్‌లు ఏర్పాటు చేశారు. తాగు, సాగునీటి కోసం ప్రాజెక్టు నుంచి కాలువలను సారంగాపూర్, ధర్మపురి మండలాలకు తవ్వించారు. మొత్తంగా కొంత వినియోగంలోకి తెచ్చారు.
ప్రాజెక్టుకు లక్ష్మీనర్సింహస్వామి ప్రాజెక్టుగా పేరు పెట్టారు. అయితే ఈ ప్రాజెక్టును మరింత ఆధునీకరించేందుకు అవకాశాలున్నాయని అధికారులు అప్పుడే ప్రతిపాదనలు రూపొందించారు. ఆధునీకరణతోపాటు ఎస్సారెస్పీ ఫీడర్ చానల్ అయిన డీ 53ని మెరుగుపరిస్తే ప్రాజెక్టు దాదాపు ఒక్క టీఎంసీ సామర్థ్యానికి చేరుకుంటుందని, ఈ ప్రాంత ప్రజలకు సాగు, తాగునీరు అందుతుందని అప్పటి ప్రభుత్వాలకు నివేదికలు ఇచ్చారు. కానీ, నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దాదాపు మూడు దశాబ్దాల పాటు ప్రాజెక్టు ఆధునీకరిస్తామంటూ రాజకీయ నాయకులు హామీలు ఇచ్చినా అవి నెరవేరలేదు. రోళ్ల్లవాగు ప్రాజెక్టు గతంలో బుగ్గారం నియోజకవర్గ ప్రజలకు, తర్వాత జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు ఒక ఎన్నికల హామీ అంశంగా మారిపోయింది. ఆధునీకరణ కలగానే మిగిలిచిపోయింది.
ఫలించిన ఈశ్వర్ కృషి
2011లో ధర్మపురి ఎమ్మెల్యేగా ఉన్న కొప్పుల ఈశ్వర్ రోళ్లవాగు ప్రాజెక్టును పరిశీలించారు. ఆధునీకరణకు నిధు లు మంజూరుకు యత్నిస్తానని ప్రకటించారు. ఆయన పలుసార్లు అప్పటి ప్రభుత్వాలకు విన్నవించినా స్పందించలేదు. ఈ క్రమంలో 2014లో ఎన్నికల సమయంలో ధర్మపురి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొప్పుల, నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన ఎంపీ కవిత ప్రాజెక్టు ఆధునీకరణ చేయిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణతో పాటు ధర్మపురి ప్రాంతంలోని మరికొంత ఆయకట్టు స్థిరీకరణ కోసం సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్వేకు 60 లక్షలు కేటాయించగా, అధికారులు పూర్తి సర్వే చేసి డీపీఆర్ రూపొదించి నివేదించారు. ఈ క్రమంలో ప్రభుత్వం 60.23 కోట్లు కేటాయించింది. 2017 మేలో అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ప్రాజెక్టు ఆధునీకరణ పనులను ప్రారంభించారు. కాల క్రమంలో ప్రాజెక్టు అంచనాలు పెరిగిపోయి 136 కోట్లకు చేరుకున్నది. అయినా ప్రభుత్వం నిధులను కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయించింది.
ప్రాజెక్టు వివరాలు
ప్రాజెక్టు నిర్మాణం, విస్తరణ కోసం రోళ్లవాగు పరిసర ప్రాంతాల్లో దాదాపు 200 ఎకరాల భూమిని సేకరించాలని నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఆ మేరకు ప్రభుత్వం ఎకరాకు 7.50లక్షల నష్టపరిహారాన్ని చెల్లించి 200 ఎకరాల భూమిని సేకరించింది. తర్వాత ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచింది. సహజసిద్ధంగా కొండల మధ్య ఏర్పడిన ఈ ప్రాజెక్టు విస్తీర్ణం పెంచుతూ, చుట్టూ మూడు కరకట్టలు నిర్మించారు. 425 మీటర్ల పొడువు, 16 మీటర్ల ఎత్తుతో ఒక కట్ట, రెండోది 300 మీటర్ల పొడువున రెండున్నర మీటర్ల ఎత్తుతో అటవీ ప్రాంతంలో నిర్మించారు. మూడోది 860 మీటర్ల పొడవున 21 మీటర్ల ఎత్తుతో నిర్మించారు. కాగా, మొత్తం కరకట్టలు ప్రాజెక్టు చుట్టూ కట్టాల్సి ఉండగా, సగం ప్రాంతాన్ని సహజ సిద్ధంగా ఏర్పడి ఉండడంతో ప్రాజెక్టుకు ప్రత్యేక శోభ వచ్చింది.
ప్రాజెక్టులో 156 మీటర్ల పొడవున 16.50 మీటర్ల వెడల్పు, 12.50 మీటర్ల ఎత్తుతో మత్తడి నిర్మించారు. అలాగే ప్రాజెక్టులోకి ఎస్సారెస్పీ నుంచి నీటిని తీసుకువచ్చే డీ 53 కెనాల్‌కు సైతం మరమ్మతులు చేసి మరింత విస్తరించారు. అలాగే ప్రాజెక్టు నుంచి నీటిని బయటకు తీసుకువెళ్లే రెండు కాలువలను సైతం ఆధునీకరించారు. పనులు వేగంగానే పూర్తయినప్పటికీ గత వానకాలంలో భారీ వర్షాలకు ప్రాజెక్టు నిర్మాణ పనులకు తీవ్ర అవరోధం జరిగింది. భారీ వరదలకు ప్రాజెక్టులో ఇసుక, మట్టిమేటలు వేసింది. వాటన్నింటినీ తొలగించి మళ్లీ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తున్నారు. నీటి పారుదల శాఖ డీఈ ఛక్రునాయక్ తెలిపిన ప్రకారం 94 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. కాగా, ఎస్సారెస్పీ నుంచి నీటిని డీ53 కాలువ ద్వారా ప్రాజెక్టులోకి లాంఛనంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ గత నెల 29వ తేదీన మళ్లించారు.
18 గ్రామాలకు ప్రయోజనం
ప్రాజెక్టు ఆధునీకరణతో 18 గ్రామాలకు నీటి సౌకర్యం మెరుగవుతున్నది. జగిత్యాల నియోజకవర్గంలోని బీర్పూర్ మండలంలో 6 నుంచి 8 వేల ఎకరాల భూమికి సాగునీరు అందుతుంది. బీర్పూర్, నర్సింహులపల్లి, తుంగూర్, కొల్వాయి, చర్లపల్లి, కండ్లపల్లి, రంగసాగర్, మంగెళ, తాళ్లధర్మారం, కమ్మునూరు గ్రామాలకు నీరందుతుంది. ఇక ధర్మపురి నియోజకవర్గంలో 9 నుంచి 12వేల ఎకరాల భూమికి సాగునీటి సౌకర్యం ఏర్పడుతుంది. దొంతాపూర్, తీగల ధర్మారం, దమ్మన్నపేట, రాజారం, జైన, నక్కలపేట, తుమ్మెనాల, మగ్గిడి గ్రామాలకు మేలు జరుగుతుంది.
ఇది బీర్పూర్, ధర్మపురి మండలాల విజయం
రోళ్లవాగు ఆధునీకరించడం బీర్పూర్, ధర్మపురి మండలాల ప్రజలు సాధించిన ఘన విజయం. 2009లో ధర్మపురి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన. ప్రాజెక్టును ఆధునీకరిస్తే ధర్మపురి, బీర్పూర్కు సాగునీరు వస్తుందని అదే సమయంలో తెలిసింది. అప్పటి నుంచి ప్రయత్నం చేశా. కానీ, సమైక్య రాష్ట్రంలో సాధ్యం కాలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవతోనే సాధ్యమైంది. 136 కోట్ల వ్యయంతో ప్రాజెక్టును ఆధునీకరించుకున్నాం. గతేడాది ప్రకృతి వైపరిత్యాల వల్ల ప్రాజెక్టు తెగిపోయింది. దీన్ని కాంగ్రెస్, బీజేపీలు అవకాశంగా తీసుకొని రోళ్లవాగుపై రాజకీయాలు చేశాయి. 40 ఏండ్లలో సాధ్యం కానిదాన్ని పూర్తి చేసుకున్నాం. ప్రజా జీవితంలో సాధించిన విజయాల్లో రోళ్లవాగు ఆధునీకరణ ఒక సంతృప్తకర అంశం.
– కొప్పుల ఈశ్వర్, మంత్రి
జీవన్‌రెడ్డి చేయలేదు మేం చేసి చూపాం..
40 ఏండ్లు ప్రజాజీవితంలో ఉండి, రెండు సార్లు మంత్రి పదవిలో ఉండి సైతం జీవన్ రెడ్డి రోళ్లవాగు, బీర్పూర్ అభివృద్ధికి ఏం చేయలేకపోయారు. వాగు ఆధునీకరణకు నిధులు మంజూరు చేయించడంలో ఆయన విఫలమయ్యారు. కానీ మేం 136 కోట్లు మంజూరు చేయించుకొని పనులు పూర్తి చేయించడం గొప్ప అనుభూతిని ఇచ్చింది. స్వరాష్ట్రంలో బీర్ పూర్‌ను మండలంగా ఏర్పాటు చేయడం, రోళ్లవాగును ఆధునీకరించడం సంతోషాన్ని కలిగించాయి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, తప్పుడు ప్రచారాలు చేసినా రోళ్లవాగు ఆధునీకరణ చాలా సంతోషదాయక విజయం.
– డాక్టర్ సంజయ్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
సాగు, తాగునీటికి రంది లేదు
రోళ్లవాగు ప్రాజెక్ట్ ఆధునీకరణతో ఈ ప్రాంతంలో సాగు, తాగునీటి ఇబ్బందులు తప్పుతాయి. ప్రాజెక్టు నీటి సామర్థ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం నాలిగింతలు పెంచింది. గత ప్రభుత్వాలు ప్రాజెక్ట్ గురించి ఏనాడూ పట్టించుకోలేదు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి 136 కోట్లు మంజూరు చేయించారు. పనులు చివరి దశకు చేరుకున్నాయి. రైతాంగానికి అండగా నిలుస్తున్న కేసీఆర్‌కు రైతులు రుణపడి ఉంటారు.
– రిక్కల ప్రభాకర్, సర్పంచ్, నర్సింహులపల్లి (బీర్పూర్ మండలం)
ఏండ్లపాటు ఇబ్బందులు పడ్డం
నాడు ఏండ్లపాటు ఇబ్బందులు పడ్డం. రోళవాగు కింద నీళ్లందక పొలాలు ఎండిపోయేవి. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ రోళ్లవాగును ఆధునీకరించిన్రు. అప్పటి ఎంపీ కవిత ఇచ్చిన హామీ నెరవేర్చిన్రు. ఏ ప్రభుత్వాలు చేయని విధంగా రైతుల కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు పెడుతున్నారు. కాళేశ్వరం నిర్మించి నీటిని ఎదురు ఎత్తిపోస్తున్నారు. – బన్క శంకర్, రైతు, మంగెళ (బీర్పూర్ మండలం)
ఇబ్బందులు తప్పుతయ్
గతంలో ఎన్నికలు వస్తే చాలు నాయకులు వచ్చి రోళ్లవాగును ఆధునీకరిస్తామని చెప్పి తీరా మొఖం చాటేసేవారు. కానీ, సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నరు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సహకారంతో రూ, 136 కోట్లతో రోళ్లవాగును ఆధునీకరించిన్రు. పనులు చివరికి వచ్చినయి. మరికొద్ది రోజుల్లోనే పూర్తయితయి. ధర్మపురి, బీర్పూర్ మండలాల్లో సాగు, తాగు నీటి ఇబ్బందులు తప్పుతయ్. తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటం.
– రామకిష్టు గంగాధర్, రైతు, కొల్వాయి (బీర్పూర్ మండలం)