పెద్దపల్లి, ఫిబ్రవరి24 : ఓవర్‌లోడ్‌తో వెళ్తుతున్న బూడిద లారీలపై రోడ్డు రవాణా శాఖ విజిలెన్స్ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ‘ఎన్టీపీసీ యాష్ ఉచితం ఉత్తదే.. ‘లోడింగ్ పేరిట దందా? ‘బూడిద లారీ పక్కదారి?’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికలో ప్రచురితమైన వరుస కథనాలకు స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్(ఎన్పోర్స్మెంట్) బృందాలు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా నుంచి వెళ్తున్న ఓవర్ లోడ్ బూడిద లారీలను పెద్ద ఎత్తున పట్టుకున్నారు. పరిమితికి మించి వెళ్లడంతోపాటు రోడ్ ట్రాన్స్పోర్ట్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న వాహనాలపై నిఘా పెంచారు. రెండు రోజులుగా ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న 35 లారీలకు జరిమానా విధించారు.
సోమవారం విజిలెన్స్ అధికారులు ప్రేమ్‌కుమార్, సురేశ్, సిబ్బంది కలిసి పెద్దపల్లిలో ఓవర్ లోడ్‌తో వెళ్తున్న ఆరు బూడిద లారీలను సీజ్ చేసి జరిమనా విధించినట్టు ఆర్టీవో పీ రంగారావు తెలిపారు. అయితే స్టేట్ విజిలెన్స్ అధికారులు జిల్లా కేంద్రంలో చేసిన తనిఖీలలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. పరిమితికి మించి ఓవర్ లోడ్‌తోపాటు ఫిట్నెస్ లేని వాహనాలు సైతం నడుపుతున్నారని అధికారులు గుర్తించారు. వే బిల్లులు లేకుండా బూడిద రవాణా చేస్తున్నారని, ఎలాంటి నంబర్లు లేకుండానే లారీలను నడిపిస్తున్నారని, చాలా మంది లారీ డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని తెలిపారు.