మానకొండూర్ రూరల్, సెప్టెంబర్ 3: ఉన్నత విద్య కోసం కూతురు అమెరికాకు వెళ్తున్న సందర్భంగా రాజన్నను దర్శించుకునేందుకు వస్తూ దంపతులు మృత్యు ఒడికి చేరారు. లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఆ ఇద్దరూ మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మానకొండూర్ మండలం ముంజపల్లి శివారులో శనివారం ఉదయం ఈ ఘోరం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకేంద్రంలోని కాశీబుగ్గకు చెందిన మామిడాల సురేందర్ (50), మాధవి (45) దంపతులకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. పెద్ద కూతురు అమెరికాలో, కొడుకుకు కెనడాలో ఉండగా, చిన్న కూతురు మేఘనను ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించేందుకు సిద్ధమయ్యారు.
మరో రెండు రోజుల్లో వెళ్లాల్సి ఉండగా, వేములవాడ రాజన్న దర్శించుకోవాలని తల్లిదండ్రులు అనుకున్నారు. అనుకున్నట్టుగానే సురేందర్ తన భార్య, బిడ్డ మేఘనతోపాటు అక్క కొడుకు కూచన్ అశోక్‌తో కలిసి శనివారం ఉదయం కారులో వేములవాడకు బయలుదేరారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి శివారులోని జాలగుట్ట వద్ద కరీంనగర్- వరంగల్ ప్రధాన రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు, ఉత్తరాఖండ్ నుంచి విజయవాడకు ైఫ్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారు నడుపుతున్న సురేందర్ అందులోనే ఇరుక్కుపోయి అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మానకొండూర్ ఎస్ఐ తిరుపతి సంఘటనాస్థలానికి చేరుకొని, క్షతగాత్రులను గ్యాస్కట్టర్ల సహాయంతో వెలికితీసి ‘108’లో కరీంనగర్ దవాఖానకు తరలించారు. మిగతా ముగ్గురు తీవ్రంగా గాయపడగా, మాధవి కరీంనగర్ దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూసింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.