వేసవి వచ్చిందంటే చాలు అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. వారం వ్యవధిలోనే పదుల సంఖ్యలో ఫైర్ యాక్సిడెంట్లు జరిగాయి. అందులో రెండు మూడు ప్రమాదవశాత్తూ జరిగినా.. ఎక్కువగా కొయ్యకాలును కాల్చడం వల్లే సంభవించాయి. ఎండపూట వీచేగాలులకు మంటలు భారీగా చెలరేగుతున్నాయి. సమీప ప్రాంతాలకు శరవేగంగా విస్తరిస్తూ.. పంట పొలాలు, తోటలను ఆహుతి చేస్తున్నాయి. పశువుల కొట్టాలూ దగ్ధమవుతుండగా, మూగజీవాలు బలవుతున్నాయి. ట్రాక్టర్లు, ఇతర వాహనాలు, విద్యుత్ వైర్లు, మోటర్లు, ఇతర విలువైన సామగ్రి బుగ్గి అవుతున్నాయి. నివాసాలవైపూ విస్తరిస్తూ భయపెడుతున్నాయి. ప్రజల అప్రమత్తతో ప్రమాదాలు తప్పుతున్నా.. వరికొయ్యలు కాల్చడం కర్షకుడికి తెలియకుండానే తీరని నష్టాన్ని మిగిల్చుతున్నది. నేలకు సారాన్ని చేకూర్చే క్రిమికీటకాలు నశించిపోవడంతోపాటు వాయు కాలుష్యం పెరిగిపోతున్నది. భూ సమతుల్యత దెబ్బతింటూ, మరో పంటపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఒక్కోసారి రైతుల ప్రాణాలకూ ముప్పు ఏర్పడుతున్నది. కొయ్యకాలును తగులబెట్టకుండా పొలంలో కలియదున్నితో ఎంతో మేలు జరుగుతుంది!
కరీంనగర్, మే 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకప్పుడు పొలం కోసిన తర్వాత రైతులు గడ్డిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకునేవారు. ధాన్యం తడిసినా పెద్దగా ఇబ్బంది పడకపోయినా.. గడ్డి తడిస్తే మాత్రం చాలా మదనపడేవారు. పశువుల కోసం అంతలా ఆరాటపడేవారు. పోస.. పోస జమచేసి కుప్పేవేసి ఏడాదంతా మేతకు వాడేవారు. అయితే, కాలక్రమేనా పశువుల వినియోగం తగ్గడం, మిషన్ల వాడకం పెరగడంతో ఇప్పుడు అదే గడ్డిని మడిలోనే తగుల బెడుతున్నారు. తెలియకుండానే పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతున్నారు. కాల్చడం వల్ల అపార నష్టాలున్నాయంటూ శాస్త్రవేత్తలు పదే పదే చెబుతున్నా మెజార్టీ రైతులు వరికొయ్యలను, గడ్డిని తగుల పెడుతూనే ఉన్నారు. తద్వారా రైతు తాను తీసుకున్న గొయ్యిలో తానేపడ్డట్టు అవుతున్నది. ఈ విధానం వల్ల ప్రకృతి దెబ్బతినడమేకాదు, అన్నదాత అన్ని రకాలుగా నష్టపోవాల్సి వస్తున్నది.
సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించి, ఈత వనాలు, ఆయిల్‌పామ్, మామిడి తోటలు, ఇతర పంటలు దగ్ధమవుతున్నాయి. విద్యుత్ మోటర్లు, వైర్లు, వాహనాలు బూడిదవుతున్నాయి. పశువుల కొట్టాలు కాలిపోతుండగా, మూగ జీవాల కూడా చనిపోతున్నాయి. మరోవైపు దగ్ధంతో భూమిపైనే కాదు, నేల లోపల అంతకంటే ఎక్కువే నష్టం వాటిల్లుతున్నది. పంటకు మేలుచేసే సూక్ష్మజీవులు చనిపోవడమేకాదు, సారవంతమైనభూమి దెబ్బ తింటుంది. దిగుబడిపై ప్రభావం చూపుతుంది.
వాతావరణం కలుషితం అవుతుంది. తగులబెట్టకుండా పొలంలో కలియదున్నితో ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కొయ్యకాళ్లు, వరిగడ్డిని కంపోస్టుగా మార్చుకోవాలని చెబుతున్నారు. కాల్చడంతో నష్టాలే తప్ప లాభం ఏమాత్రం ఉండదని వ్యవసాయ హెచ్చరిస్తున్నారు. ఒక్కో సారి కాల్చే పొగతో రైతు ఊపిరాడక చనిపోయిన సందర్భాలున్నాయని వివరిస్తున్నారు.

ఈ నెల 22న మెట్పల్లి మండలంలోని మెట్లచిట్టాపూర్ శివారులో వరికొయ్యలకు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించాయి. సమీపంలోనే ఉన్న ఈతవనానికి అంటుకున్నాయి. ఫైరింజన్ వచ్చి ఆర్పే ప్రయత్నం చేసినా దగ్ధమైంది.
ఎన్నో సంఘటనలు.. మచ్చుకు కొన్ని

కాల్వశ్రీరాంపూర్, మే 24 : కొయ్యకాలును తగులబెట్టడంతో జాఫర్‌ఖాన్‌పేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాదాపు ఐదు గంటలపాటు మంటలు చెలరేగినా.. ఊరంతా అప్రమత్తం కావడంతో పెను ముప్పు తప్పింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 10గంటల ప్రాంతంలో జాఫర్‌ఖాన్‌పేట గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు పొలాల్లో కొయ్యకాలుకు నిప్పంటించడంతో మంటలు చెలరేగాయి. అవి గాలికి ఎగిసిపడుతూ దాదాపు 4 కిలోమీటర్ల వరకు అంటే నివాస గృహాల వరకు వ్యాపించాయి. 200 ఎకరాల్లో పైపులు, మోటర్లు, స్టాటర్లు కాలిపోయాయి. సమీపంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రంవైపు, గ్రామ సమీపంలో ఉన్న ఇండ్లవైపు భారీగా మంటలు వ్యాపించాయి.
సర్పంచ్ యాదగిరి జ్యోత్స్న శ్రీనివాస్‌తో పాటు గ్రామస్తులు అప్పటికే అప్రమత్తమయ్యారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులతోపాటు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతోపాటు రైతుల సహకారంతో మంటలను ఆర్పివేశారు. మరోవైపు ట్రాక్టర్లతో కొనుగోలు కేంద్రం చుట్టూ మట్టి కుప్పలు పోసి వ్యాపించకుండా చేశారు. ఉదయం 10గంటల నుంచి మొదలైన మంటలను మొత్తంగా మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో అదుపులోకి తెచ్చారు. లక్షల్లో ఆస్తినష్టం జరిగిందని గ్రామస్తులు వాపోయారు. ఈరవేన లస్మమ్మకు చెందిన గుడిసెకు నిప్పు అంటుకున్నదని, వెంటనే మంటలను ఆర్పివేసినా పాక్షికంగా దగ్ధమైందని చెప్పారు. వరికొయ్యలకు నిప్పంటించిన వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
కలియ దున్నితే చాలా ప్రయోజనాలు
వరి కొయ్యలు నేలలో కలియదున్నడం వల్ల సేంద్రియ కర్బన శాతం పెరిగి దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశమున్నది. దుక్కిదున్నే సమయంలో సూపర్ ఫాస్పేట్ చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది.
కలియ దున్నితే ఎకరాకు దాదాపుగా టన్ను ఎరువు తయారవుతుంది.మొక్కలకు 2 శాతం నత్రజని(యూరియా), 4 శాతం పాస్పరస్ అదనంగా అందిస్తుంది. జింక్, మాంగనీస్, ఇనుము, కాల్షియం లాంటి సూక్ష్మధాతువులు పంటకు మేలు చేకూర్చుతాయి. నేలలో కరుగని మూలకాలనూ పంటకు అనుకూలంగా మార్చుతుంది. నీటినిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఒక టన్ను వరి గడ్డి కావాలంటే.. ఆ వరి పెరుగుదల కు 18.9 కిలోల పొటాషియం, 6.2 కిలోల నత్రజ ని, 1.1 కిలోల భాస్వరంతో పాటు కొంత మోతాదు లో సూక్ష్మపోషకాలు అవసరం అవుతాయి. కొయ్యకాళ్లను భూమిలో కలియ దున్నితే, గడ్డి ద్వారా పోషకాలన్నీ తిరిగి నేలకు చేరుతాయి.

ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌లో వరి కొయ్యలను కాల్చే క్రమంలో అంటుకున్న మంటలు ఆవాసాల వరకు చేరాయి. స్థానికులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఇటీవల వెంకటాపూర్‌లో ఓ కోళ్ల షెడ్డుకు మంటలంటుకొని వందలాది కోళ్లు మృతి చెందాయి.

ఈ నెల 21న ఉదయం ఓదెల మండలం ఇందుర్తిలో గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో కొయ్యకాలుకు నిప్పు పెట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. వరి కోసి కుప్పులుగా పోసిన 15 క్వింటాళ్ల సీడ్ వడ్లు దగ్ధమయ్యాయి.

ఈ నెల 22 శంకరపట్నం మండలం ధర్మారం శివారులో వరికొయ్యలకు నిప్పు పెట్టడంతో ఆయిల్‌పామ్ తోట దగ్ధమైంది. దీంతో రైతుకు భారీ నష్టం జరిగింది. అదే రోజు తాడికల్ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు వరికొయ్యలకు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. గాలులకు వేగంగా నివాసగృహాల వైపు వ్యాపించాయి. ఫైరింజన్ అందుబాటులో లేకపోవడంతో చివరకు పంచాయతీ ట్రాక్టర్ సహాయంతో నీటిని చల్లడంతో ప్రమాదం తప్పింది.

ఈ నెల 23న కోరుట్ల మండలంలోని యూసుఫ్‌నగర్ గ్రామంలో వరికొయ్యలకు నిప్పంటుకొని సమీపంలో ఉన్న 50 ధాన్యం బస్తాలు దగ్ధమయ్యాయి.

ఈ నెల 23న ఓదెల మండలంలోని గుండ్లపల్లిలో కాలిపోయిన టిప్పర్

ఈ నెల 19న కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేటలో కొయ్యకాలుకు నిప్పంటించడంతో సమీపంలోనే ఉన్న సీడ్ మగ వరితోపాటు విద్యుత్ వైర్లు, పైపులు బూడిదయ్యాయి.