రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన సన్న బియ్యం పంపిణీ మూడు రోజుల ముచ్చటే అవుతున్నది. ఈ నెల మొదలై దాదాపు పదిహేను రోజులవుతున్నా ఇప్పటి వరకు రేషన్ షాపుల్లో సగం మందికి కూడా అందలేదు. పంపిణీలో తీవ్ర జాప్యమవుతుండడంతో పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదాముల వద్ద డీలర్ల పడిగాపులుకాస్తుండగా.. షాపుల చుట్టూ ప్రజలు చక్కర్లు కొడుతున్నారు. మొత్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారగా, కేసీఆర్ పదేండ్ల పాలనలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదని గుర్తు చేస్తున్నరు.
రాజన్న సిరిసిల్ల, మే 14 (నమస్తే తెలంగాణ) : సన్న బియ్యం పేదలకు అందడంలో ఆలస్యమవుతున్నది. పంపిణీ గడువు దాటుతున్నప్పటికీ ఇంకా దుకాణాలకు చేరలేదు. దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యమా? ప్రభుత్వ వైఫల్యమా? అన్న చర్చ జరుగుతున్నది. రేషన్ షాపుల ద్వారా ప్రతినెలా ఒకటో తేదీ నుంచి పేదలకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. నెల చివరి వారంలోగా అన్ని దుకాణాలకు రేషన్ బియ్యం గోదాముల నుంచి సరఫరా చేయాలి. అయితే, ప్రస్తుతం 11వ తేదీ వచ్చి పంపిణీ గడువు ముగుస్తున్నా ఇప్పటి వరకు కొంత మందికి మాత్రమే బియ్యం అందాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 345 రేషన్ దుకాణాలుండగా, మిగిలిన 223కుపైగా దుకాణాలకు ఇంకా బియ్యం రాలేదు. దీంతో రేషన్ బియ్యంపై ఆధార పడ్డ పేదల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 1,97,805 రేషన్ కార్డులుండగా, లబ్ధిదారులు 5,22,764 మంది ఉన్నారు. కార్డుల్లో 1,60,349 ఫుడ్ సెక్యూరిటీ కార్డులకు 4,85,308 మంది లబ్ధిదారులు, 13,752 అంత్యోదయ కార్డులకు 37,456 మంది లబ్ధిదారులు ఉన్నారు. మొత్తం లబ్ధిదారులుకు ప్రతినెలా 29,118.48 క్వింటాళ్ల బియ్యం పంపిణీ జరుగుతున్నది. ప్రతి నెలా 26వ తేదీ వరకు జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల పరిధిలోని రేషన్ దుకాణాలకు సిరిసిల్ల, వేములవాడ పౌరసరఫరా గోదాముల నుంచి లారీల ద్వారా బియ్యం చేరవేస్తారు. ఈ ప్రక్రియ 31లోగా పూర్తి చేయాలి. డీలర్లు ప్రతి నెలా ఒకటి నుంచి 15వ తేదీ వరకు పంపిణీ చేయాల్సి ఉండగా, ఈనెల ఇప్పటి వరకు కొన్ని దుకాణాలకు బియ్యం చేరకపోవడంతో ఇంకెప్పుడు పంపిణీ చేయాలంటూ డీలర్లు ప్రశ్నిస్తున్నారు. సిరిసిల్ల అర్బన్, వేములవాడ అర్బన్ మండలాలతోపాటు కొన్ని మండలాలకు మాత్రమే గోదాముల నుంచి బియ్యం చేరుకున్నాయి. 345 మంది డీలర్లుంటే అందులో 122 మంది డీలర్లకు మాత్రమే అందాయి. సిరిసిల్ల గోదాం పరిధిలో 247 దుకాణాలకు 79 దుకాణాలకే బియ్యం సరఫరా చేశారు. 19,400ల క్వింటాళ్లకు 12 వేల క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. ఇంకా 7,400 వేల క్వింటాళ్ల బియ్యం రావాల్సి ఉంది. వేములవాడ పరిధిలో 98 దుకాణాలుండగా అందులో 43 దుకాణాలకు మాత్రమే బియ్యం చేరినట్లు తెలిసింది.
జిల్లాలో ఇంకా 223 మంది డీలర్లు గోదాముల వద్ద పడిగాపులుగాస్తున్నారు. అదిగో ఇదిగో అంటూ చెబుతున్న అధికారులు స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదంటూ డీలర్లు వాపోతున్నారు. కాగా, పోర్టబిలిటీ 7 నుంచి 9 వరకే ఉన్న గడువు కూడా ముగిసింది. రైస్ రిక్యూర్మెంట్ కోసం ఆన్లైన్లో డీలర్ పెట్టుకోవాల్సిన రిక్వెస్ట్ టైం కూడా దాటిపోవడంతో డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల బియ్యం పంపిణీలో జాప్యం జరిగితే వచ్చే నెల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. సిరిసిల్ల జిల్లాకు రావాల్సిన బియ్యం పెద్దపల్లి జిల్లా నుంచి వస్తున్నాయి. యాసంగి పంట దిగుబడితో లారీలన్నీ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పరిమితం కావడంతో బియ్యం సరఫరాలో ఆలస్యం జరిగిందని అధికారులు చెపుతుండగా, డీలర్లు మాత్రం వారి నిర్లక్ష్యమే కారణమంటున్నారు. గత పదేండ్లుగా ధాన్యం కొంటలేరా? బియ్యం పంపిణీ జరగలేదా? అంటూ ప్రజలు మండి పడుతున్నారు. అప్పుడెట్ల సాధ్యమైంది. ఇప్పుడెందుకు ఆలస్యమవుతుందంటూ నిలదీస్తున్నారు.
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యంలో 40 శాతం నూకలే ఉంటున్నాయని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదాములకు వచ్చే బియ్యం తనిఖీ చేసేందుకు క్వాలిటీ కంట్రోల్ అధికారి పట్టించుకోక పోవడమే దీనికి కారణమని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి నెలా పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీ చేసిన తర్వాతనే డీలర్లకు చేరేవి. అప్పుడు ఉన్న క్వాలిటీని పరిశీలించే యంత్రాలు కూడా గోదాముల్లో కానరావడం లేదు. పేదల కోసం ఇస్తున్న సన్నబియ్యం మిల్లర్ల కక్కుర్తితో నూకలు వస్తున్నాయని పలువురు వాపోతున్నారు. మరోవైపు 50.580 కిలోలు ఉండాల్సిన బియ్యం బ్యాగు 47 నుంచి 48 కిలోలు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. దీంతో ఒక్కో డీలరు క్వింటాల్ నుంచి రెండున్నర క్వింటాళ్ల వరకు నష్టపోతున్నాడు. దీనికి కారణం గోదాం వద్ద వేబ్రిడ్జి లేకపోవడమే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ జిల్లాలో ఉన్నట్టు సమాచారం కూడా లేదని తెలుస్తున్నది.
రేషన్ బియ్యంపై ఆధారపడేది ఎక్కువగా గ్రామీణ పేదలే. నెలరాగానే ఎదురచూసేది వాళ్లే. ప్రతి నెలా ఒకటి నుంచి 15లోగా ఇవ్వాల్సిన రేషన్ బియ్యం నేటికీ అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని గ్రామాల్లో కొద్దిపాటి స్టాక్ వచ్చిన రోజే అయిపోవడం, మళ్లీ రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. బియ్యం కోసం రేషన్ షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎప్పుడొస్తాయని డీలర్లకు ఫోన్లు చేస్తున్నారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులను కూడా ఆరా తీస్తున్నారు. సన్న బియ్యం దేవుడెరుగు కనీసం తినేందుకు దొడ్డు బియ్యం ఇచ్చినా బాగుండేదని చెబుతున్నారు.
రేషన్‌బియ్యం ఇంకా రాలేదు. ఎప్పుడిత్తరో ఎవ్వలు చెప్తలేరు. మా తండోల్లు సార్లకు ఫోన్ జేసిర్రట. ఎవ్వరు కూడా సరిగా వచ్చేది చెప్తనే లేరంటున్రు. మేం ఆరుగురం ఉన్నం. మాకు 36 కిలోల బియ్యం వత్తయ్. ఒకటి తారీఖు నుంచి 15 తారీఖు లోగా ఇచ్చుడు అయిపోతుండె. ఇప్పటిదాకా రానే లేదు.
మేము రేషన్‌బియ్యమే తింటం. ఎప్పుడూ పది తారీఖు లోపే బియ్యం ఇచ్చేది. ఈ సారి ఇప్పటికీ బియ్యం ఇయ్యలె. మేం ముగ్గురం ఉన్నం. 18 కిలోల బియ్యం వత్తయ్. ఇంకా రాలె. ఎవ్వరిని అడిగినా మాకు తెల్వదంటుర్రు.