కలెక్టరేట్, డిసెంబర్ 26: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపల్ వార్డుల్లో ప్రజా పాలన సభలు కట్టుదిట్టంగా నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. మంగళవారం ఆయన సమీకృత కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు ఎన్ ఖీమ్యానాయక్, పూజారి గౌతమితో కలిసి ప్రజాపాలన సభలకు సంబంధించిన సన్నాహక ఏర్పాట్లపై ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు పాలనను చేరువ చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు పని దినాల్లో జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు.
ప్రతి మండల పరిధిలో తహసీల్దార్, ఎంపీడీవో ఆధ్వర్యంలో రెండు బృందాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి బృందం రోజుకు రెండు గ్రామాల చొప్పున పర్యటించాలన్నారు. ప్రతి రోజూ ఉదయం 8 నుంచి 12గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షెడ్యూళ్లలో గ్రామసభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించాలని చెప్పారు. ప్రజాపాలన నిర్వహణపై మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించుకుని తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. సభల నిర్వహణకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, తాగునీరు, టెంట్, కుర్చీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి వంద కుటుంబాలకొక కౌంటర్ కేటాయించాలన్నారు. మహిళలు, వయోవృద్ధులు, దివ్యాంగులకు వేర్వేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు స్వీకరించాలని, ఆధార్, రేషన్‌కార్డు జతచేసేలా చూడాలన్నారు. ప్రతి దరఖాస్తు స్వీకరించి, రసీదు అందించాలన్నారు.
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ పూజారి గౌతమి మాట్లాడుతూ, మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలని, దరఖాస్తుదారులు ముందస్తుగా ఫాం నింపుకొని సభకు వచ్చేలా చూడాలన్నారు. గ్రామసభ నిర్వహణపై డప్పుచాటింపు ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. కరోనా వ్యాప్తిస్తున్న దృష్ట్యా అధికారులు గ్రామ సభల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. ప్రతి రోజూ ఎన్ని గ్రామాల్లో సభలు ఏర్పాటు చేశారు.. ఎన్ని దరఖాస్తులు వచ్చాయో రిపోర్టు రోజువారీగా తమకు పంపాలని డీపీవో రవీందర్ సూచించారు. ఇక్కడ అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యానాయక్, ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీవోలు ఆనంద్‌కుమార్, మధుసూదన్‌రెడ్డి, జడ్పీసీఈవో గౌతంరెడ్డి, డీటీవో కొండల్రావు, పౌరసరఫరాల అధికారి జితేందర్‌రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.