Revenue | కలెక్టరేట్, మే 31 : జూన్ 3వ తేదీ నుంచి 20 వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లాలోని ఆర్డీవోలు, అన్ని మండలాల తహసీల్దార్లు, డీటీలు, ఆర్ఐలతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణ, అప్లికేషన్లు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు.
ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో వచ్చే నెలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతీ మండలంలో నిర్వహించే సదస్సులపై రెండు రోజుల ముందుగా ఆయా గ్రామాలకు సమాచారం ఇవ్వాలని, అప్లికేషన్ తో పాటు ఇవ్వాల్సిన పత్రాలపై సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రతి గ్రామంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సదస్సులు నిర్వహించాలని తెలిపారు. సదస్సులు నిర్వహించే చోట హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని, అప్లికేషన్ ఫారాలు ఇతర కావాల్సిన సామగ్రిని అందుబాటులో ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అప్లికేషన్ పూర్తిగా పక్కా సమాచారంతో నింపాలని తెలిపారు.
ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూముల పరిరక్షించాలని స్పష్టం చేశారు. భూములకు సంబంధించి వచ్చే అప్లికేషన్ వివరాలు ఒక రిజిస్టర్ ఏర్పాటు చేసి దానిలో నమోదు చేయాలని పేర్కొన్నారు. అప్లికేషన్ లు ప్రతి అంశం చక్కగా రాయాలని అప్లికేషన్ స్వీకరించిన తర్వాత దరఖాస్తుదారులకు రిసీవ్డ్ కాఫీ అందజేయాలని, వారి కోసం ప్రత్యేకంగా సిబ్బంది నియమించి రాయించాలని సూచించారు. అందరూ సమన్వయంతో పనిచేసే సదస్సులను విజయవంతం చేయాలని సూచించారు.
ప్రతి మండలంలో రెండు టీములు ఏర్పాటు చేయాలని ఒక టీముకు తహసీల్దార్లు,, మరొక టీంకు డిప్యూటీ తహసీల్దార్లు నేతృత్వం వహించాలని సూచించారు. ఆయా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు సదస్సులకు వచ్చే ముందు తమ భూమికి సంబంధించిన పత్రాలను వెంట తీసుకెళ్లాలని కలెక్టర్ చూపించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్ తదితరులు పాల్గొన్నారు.