Errakunta Lake | మంథని/మంథని రూరల్, జూన్ 30:దాదాపు 10 ఎకరాల పైన ఉన్న ఎక్లాస్పూర్ ఎరకుంట చెరువును కొంత మంది వ్యక్తులు శిఖం భూమి ఉందనే జేసీబీలు, ఫ్రంట్ బ్లేడ్ ట్రాక్టర్లతో చెరువు కట్టను, తూమును, మత్తడిని పూర్తిగా ధ్వంసం చేసి చెరువు ఆనవాళ్లే లేకుండా చేశారు.
ఈ విషయాన్ని నమస్తే తెలంగాణ కళ్లకు కట్టినట్లుగా ప్రచురితం చేయడంతో అధికార యంత్రాంగం కదిలింది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు సంయుక్తంగా ఎరకుంట చెరువును సందర్శించారు. చెరువు ఆనవాళ్లు లేకుండా చేసిన విషయాన్ని పరిశీలించడంతో పాటు చెరువు ధ్వంసంపై అధికారులు నివేదికలు తయారు చేస్తున్నారు. దీనిపై ఏఈ నిఖిల్ మాట్లాడుతూ ఎరకుంట చెరువు పూర్తిగా ఇరిగేషన్ శాఖలో రికార్డు అయి ఉందన్నారు.
చెరువును ధ్వంసం చేయడం ఎవరికీ హక్కు లేదని దీనిపై పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. అదే విధంగా తహసీల్దార్ కుమారస్వామి మాట్లాడుతూ చెరువు ధ్వంసం విషయం తమ దృష్టికి రావడంతో తమ సిబ్బందికి సంఘటనా స్థలానికి పంపించినట్లు తెలిపారు. చెరువు ధ్వంసం చేసిన విషయం వాస్తవమేనని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందించి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.