కరీంనగర్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : బీసీల ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని బీజేపీ విష ప్రచారం చేస్తున్నదని, నిరుద్యోగ యువత కోసం ఆ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానం కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా సోమవారం రాత్రి కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభకు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం రాష్ట్రంలో ఆ పార్టీ ఏం చేసిందో చెప్పి పట్టభద్రుల ఓట్లు అడగాలని సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, విప్‌లు అడ్లూరి లక్ష్మన్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మేడిపల్లి సత్యం, ఠాకూర్ మక్కాన్ సింగ్, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తదితరులు ప్రసంగించారు.