విధి నిర్వహణలో అంకిత భావంతో సేవలందించి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు మలి వయసులో అధికారుల నుంచి చిన్నచూపే దిక్కవుతున్నది. ఇంటి స్థలాల కోసం 44 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ‘అదిగో.. ఇదిగో’ అంటూ మభ్యపెడుతున్నారే తప్ప స్థలం మాత్రం ఇవ్వడం లేదు. 1981లో బొమ్మకల్ వద్ద కేటాయించిన స్థలానికి బదులుగా తిమ్మాపూర్ మండలంలోని ఎస్సారెస్పీ భూములను ఇవ్వడానికి 2010లో ప్రతిపాదనలు సిద్ధం చేసినా నేటికి అది కూడా ఆచరణకు నోచుకోలేదు. రేపు మాపు అంటూ ఇన్నాళ్లు కార్యాలయాల చుట్టూ తిప్పించుకొని, ఇప్పుడు సీసీఎల్ఏ పేరు చెప్పి దాటవేసే ప్రయత్నాలు చేయడం కనిపిస్తున్నది. ఈ వ్యవహారంలో ఫైళ్లు కదలిన తీరును చూస్తే ‘నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు’ అన్నట్టు ఉండగా, ఇక రేపో మాపో వస్తుందన్న ఆశతో మలివయసులోనూ రిటైర్డు ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న తీరు అందరనీ కలచి వేస్తున్నది.
కరీంనగర్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వందలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు ఇంటి స్థలాల కోసం చేస్తున్న పోరాటం.. వారికి బొమ్మకల్‌లో కేటాయించిన భూమి కబ్జాల గురైన తీరును ‘రిటైర్డు టీఎన్జీవోల భూమి కబ్జా’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన విషయం తెలిసిందే. అందులో మరింత లోతుగా వెళ్తే ఉద్యోగులకు ఉద్యోగులే శత్రువులు అన్నట్టు కనిపిస్తున్నది. పూర్వ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పనిచేసిన ఉద్యోగులు 1980లో కరీంనగర్ జిల్లా తెలంగాణ నాన్ గెజిటెట్ ఆఫీసర్ల పేరిట గృహ నిర్మాణ సహకార సొసైటీ (రిజిస్టర్ నంబర్ 1103)ను ఏర్పాటు చేసుకోగా, అప్పటి కలెక్టర్ భూమి కేటాయించిన విషయం తోపాటు బొమ్మకల్ పరిధిలోని సర్వేనంబర్ 96లో 20 ఎకరాలను 1981 ఆగస్టు 31న (ప్రొసీడింగ్స్ నంబర్ ఎ5/1052/81) కేటాయించినా ఉద్యోగులకు స్వాధీనం చేయని విషయాన్ని సైతం ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి చ్చింది. దీనిపై వివిధ కారణాలు చెప్పడంతో మరోచోట స్థలం కేటాయించాలంటూ ఆనాడు భూమిరాని రిటైర్డ్ ఉద్యోగులంతా బాధిత సభ్యుల ఫోరం పేరిట ఒక సంఘంగా ఏర్పడి, నాటి నుంచి నేటి వరకు పోరాటం చేస్తున్నారు. చివరకు 2006లో ఆనాటి కలెక్టర్.. రిటైర్డ్ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు వాస్తవాలు గ్రహించి, బొమ్మకల్‌లో కేటాయించిన భూమికి ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా స్థలం కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దాంతో స్థలం కోసం అన్వేషించిన అధికారులు, తిమ్మాపూర్ మండలంలోని యాదవుల పల్లె గ్రామ పరిధిలో శ్రీరాంసాగర్ భూములున్నాయని గుర్తించారు. ఆనాటి తహసీల్దార్ సర్వే చేసి, సర్వేనంబర్ 502లో మొత్తం విస్తీర్ణం 13.04 ఎకరాలు ఉండగా, అందులో 9.29 ఎకరాలు ఇవ్వొచ్చని ప్రతిపాదించారు. అలాగే సర్వేనంబర్ 522లో మొత్తం 9.23 ఎకరాలుండగా, అందులో 9 ఎకరాలు ఇవ్వొచ్చని పేర్కొంటూ 2010 జూన్‌లో జిల్లా రెవెన్యూడివిజనల్ అధికారికి లేఖ రాశారు. మొత్తం రెండు సర్వేనంబర్ల పరిధిలో 18.23 ఎకరాలు రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ల స్థలం కోసం ఇవ్వడానికి అనుకూలంగా ఉందని తహసీల్దార్ తన ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఎస్సారెస్పీ స్థలాన్ని గుర్తించామని, పై సర్వేనంబర్లలో ఇళ్ల స్థలాలు కేటాయించడానికి ఎన్వోసీ జారీ చేయాలని కోరుతూ ఎస్సారెస్పీ అధికారులకు 2012 మార్చిలో ఆనాటి రెవెన్యూ డివిజనల్ అధికారి లేఖ రాశారు. ఆ మేరకు అష్టకష్టాలు పడి ఉద్యోగులే ఎన్వోసీ తెచ్చుకున్నారు. సదరు ఎన్వోసీని తిరిగి రెవెన్యూ అధికారులకు సమర్పించారు. ఇక అంతా అయిపోయింది తమకు ప్లాట్స్ వస్తాయని ఉద్యోగులు సంబురపడ్డారు. కానీ, ఆ ఫైలును ప్రతిపాదనలకే పరిమితం చేసిన రెవెన్యూ అధికారులు, రేపు మాపు అంటూ ముప్పు తిప్పలు పెట్టారు. దీంతో మళ్లీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయగా, 2017 జూన్‌లో అప్పటి కలెక్టర్ వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సత్వర చర్యలు తీసుకోవాలంటూ ఆనాటి ఆర్డీవోకు లేఖ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. కానీ, ఆఆదేశాలను సైతం ఆనాటి అధికారులు తుంగలో తొక్కారు. సత్వర చర్యలు తీసుకోక పోగా, రేపు మాపు అంటూ తమనైజాన్ని చాటుకున్నారు. అయినా తమ ఇండ్ల స్థలాలు ఎలాగైనా సాధించుకోవాలన్న కోరికతో పోరాటం చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు, గతేడాది మార్చిలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. తమ ఫైలును ఏళ్ల తరబడిగా అధికారులు తొక్కిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్.. కలెక్టర్ నుంచి వివరణ కోరారు. 2025 మార్చి 15న రెవెన్యూ అధికారులు కలెక్టర్‌కు ఒక లేఖ ద్వారా వివరణ పంపించారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఎస్ఎల్పీ నంబర్ 12616, 12618 ప్రకారం పెండింగ్‌లో ఉన్నాయని, ఈ విషయంలో సీసీఎల్ఏ క్లారిఫికేషన్ కోసం రాశామని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. నిజానికి సీసీఎల్ఏ నుంచి క్లారిఫికేషన్ కోసం అధికారులు గతేడాది జూన్ 14న ఒక లేఖ (లెటర్ నంబర్ బి1/4719/2007) రాశారు. ఉద్యోగుల ఇంటి స్థలాలు, సుప్రీంకోర్టు ఆర్డర్స్‌పై క్లారిటీ ఇవ్వాలని కోరారు. కానీ, సీసీఎల్ఏ నుంచి క్లారిఫికేషన్ తెప్పించేందుకు అధికారులు ప్రయత్నించిన దాఖలాలు లేవు. దీంతో ఆ ఫైలుపై నీలినీడలు కమ్ముకోగా, ఓపిక నశించిన సంఘం సభ్యులు, ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.
మాకు సుప్రీంకోర్టు ఆర్డర్ వర్తించదు. నిబంధనల ప్రకారం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు 2010 నుంచి వర్తిస్తాయి. కానీ, మాకు 1981లో కేటాయింపులు జరిగాయి. అదే విషయాన్ని ప్రతి రిప్రజెంటేషన్లోనూ చెప్పుకుంటూ వెళ్తున్నాం. అధికారులు మాత్రం దాటవేసే ధోరణి అవలంభిస్తున్నారే తప్ప మాకు సంపూర్ణంగా సహకరించడం లేదు. ఇంటి స్థలం కోసం 44 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. మా బాధలను అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా మా సమస్యను సత్వరం పరిష్కరించి, ఇంటి స్థలాలు కేటాయించాలి. అధికారులు స్పందించకుంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. కోర్టులకు వెళ్లడం, ఆందోళనలు చేయడం మా లక్ష్యం కాదు. కానీ, తిరిగి తిరిగి వేసారిపోయినం. ప్రస్తుత టీఎన్జీవోలు కూడా మా పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం.