కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 7 : గతేడాది మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) కరీంనగర్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా శాఖల ప్రతినిధులు, సభ్యులు మహా ధర్నా చేశారు. ఉమ్మడి జిలా నుంచి సుమారు 400 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు పొల్గొని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి మాట్లాడుతూ, 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలూ అందించకపోవడం బాధాకరమన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల ఖాతాల్లో కేవలం పెన్షన్ మాత్రమే జమ చేస్తుండడంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నామన్నారు.
35 నుంచి 40 ఏండ్ల్లపాటు ప్రభుత్వ సేవలో పనిచేసి ఉద్యోగ విరమణ పొంది, చివరి అంకంలో ఉన్నవారిపై ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుండడం సముచితం కాదన్నారు. ఇప్పటికైనా స్పందించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని డిమాం డ్ చేశారు. లేనిపక్షంలో వరుస ఆందోళనలు, నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టేందుకైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మహాధర్నాలో రేవా జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల ప్రభాకర్‌రావు, ఉపాధ్యక్షుడు గద్దె జగదీశ్వరాచారి, కోశాధికారి కనపర్తి దివాకర్, రేవా వరంగల్ జిల్లా అధ్యక్షుడు ధర్మేందర్, సిద్దిపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాములు, కిషన్‌నాయక్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు పర్శరాములు, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, జగిత్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్నం రాంరెడ్డి, ఏ చంద్రమౌళి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు వెంకటరాములు పాల్గొన్నారు.