రాంనగర్, డిసెంబర్ 30 : న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రజలంతా శాంతియుత వాతావరణంలో సంబురాలు చేసుకోవాలని సూచిస్తూనే, అదే సమయంలో వేడుకల పేరిట హద్దు దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. నిరంతర డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తామని, స్పెషల్ యాక్షన్ టీంలు నేటి సాయంత్రం నుంచే రంగంలోకి దిగుతాయని చెప్పారు. అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చే హంగామా చేసే వారిపై కఠినంగా వ్యవహరించడమే కాక కేసులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. కాగా, మంగళవారం సాయంత్రం 6 నుంచి బుధవారం ఉదయం 5 గంటల వరకు నగర శివారులోని తీగల వంతెన, లోయర్ మానేరు డ్యాం కట్టపైకి వెళ్లేందుకు అనుమతించబోమని, అకడ వేడుకల నిర్వహణను నిషేధించినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఒక ప్రకటనలో తెలిపారు.