Dasari Manohar Reddy | పెద్దపల్లి, మే 21 (నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న కొనుగోళ్ల సమస్యలు, మట్టి తరళింపు లాంటి అంశాలపై తాను మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడితే.. రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా.. పెద్దపల్లి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న చింతకుంట విజయరమణారావు విచక్షణ కోల్పోయి మాట్లాడటం ఆయన సంస్కారానికే నిదర్శనమని, సమస్యలను ప్రస్థావిస్తే.. వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి హితవు పలికారు. గురువారం పెద్దపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తనను ఉద్దేశించి ఎమ్మెల్యే.. ‘నీ మొఖం ఎక్కడది.. నీ బతుకు ఎక్కడది’ అని మాట్లాడడం ప్రజాప్రతినిధులకు తగదని అన్నారు. ‘నీ మొఖం ఉన్నట్టే నా మొఖం ఉంటుంది.. నీ బతుకు ఉన్నట్టే నా బతుకు ఉంటుంది’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ‘నువ్వు మనిషివైతే ఎదుటివాడు మనిషిలా కనిపిస్తాడు.. నువ్వు ఇంకోటి అయితే ఇంకోలాగా కనిపిస్తాడు..’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఒక ప్రభుత్వ విప్ అయి ఉండి ‘కుక్కలు, నక్కలు, లుచ్చాలు, దొంగలు’ వంటి పదజాలం ఉపయోగించడం సరైంది కాదని, లుచ్చా పని చేసేటోడికి అందరూ లుచ్చలాగే కనిపిస్తారని, దొంగ పని చేసేటోడికి అందరూ దొంగలాగే కనిపిస్తారు..’అంటూ చురకలు అంటించారు. మట్టి వ్యవహారంపై స్పందిస్తూ, తాను చెరువు మట్టిని పొలాల్లో వేయడం అనేది అప్పటి ప్రభుత్వ పథకం ‘మిషన్ కాకతీయ’లో భాగం అన్నారు. చెరువులు లోతు కావాలి, మట్టి పొలాల్లో పడాలి, భూసారం పెరగాలి అనే ఆలోచనతో ప్రభుత్వం ఆ పథకం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. “పొలంలో పోయకపోతే నీ నోట్లో పోస్తానా?” అని ప్రశ్నిస్తూ విమర్శకులపై తీవ్ర స్థాయిలో స్పందించారు. 2009లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఎటువంటి అనుమతులు లేకుండా మీరే చెరువులు తవ్వించారని, ఇటుకబట్టీలకు మట్టి తరలింపులు జరిగాయని ఆరోపించారు. ఈ మట్టి దొంగతనానికి ఆద్యుడు నువ్వే అని నేరుగా విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మైనింగ్, ఇరిగేషన్ శాఖల ద్వారా నియంత్రణ తీసుకువచ్చి రైతులకు మట్టి వినియోగం ప్రోత్సహించిందని గుర్తు చేశారు. ఇసుక అక్రమాల అంశంలో కూడా ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. స్థానిక అవసరాల కోసం ఉచిత ఇసుక విధానం తానే తీసుకొచ్చానని, కానీ ఇప్పుడు అదే పేరుతో అక్రమ రవాణా జరుగుతోందని అన్నారు. పిట్టలఎల్లయ్యపల్లి, నారాయణపూర్, సుగ్లాంపల్లి ప్రాంతాల్లో ఇసుక డంపులు వేసి రాత్రిళ్లు హైదరాబాద్‌కు లారీలు పంపుతున్నారని గుర్తు చేశారు.
ఇసుక దందా ఎవరు చేస్తున్నారు..? అని ప్రశ్నిస్తూ, “ఒక్క ఇసుక లారీ కూడా తిరగకుండా ఆపితేనే.. ఒక్క మట్టి లారీ కూతా తిరగకుండా ఆపితేనే మీది నిజాయితీ అని నమ్ముతాం అన్నారు. మీ నాయకులు సంబంధించిన ఇసుక లారీలను పట్టుకున్న అధికారులను బదిలీ చేసిన ఘటనలను కూడా ఆయన ప్రస్తావించారు. తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ, ‘నేను ఒక్క రూపాయి తినలేదు..’ అని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రతి గ్రామ దేవాలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమని అన్నారు. ‘నువ్వు రైస్ మిల్లర్ల వద్ద, ఇటుక బట్టి యజమానుల వద్ద పైసలు తీసుకున్నావని నేను ప్రతి గుడిలో ప్రమాణం చేస్తా’ అంటూ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. దొంగతనం, లంగ పని, లుచ్చ పని అంతా మీదే అంటూ తీవ్రమైన పదజాలం ఉపయోగించారు. “మాకు కూడా నోరు ఉంది, కానీ సభ్యత సంస్కారం అడ్డం వస్తుంది.. అని వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతం కాదని హెచ్చరిస్తూ, ఇంకో రెండున్నర సంవత్సరాల తర్వాత సినిమా చూస్తావు.. అన్నారు. పిల్లిని గదిలో వేసి కొడితే పులి అవుతుంది.. అనే సామెతను ఉపయోగిస్తూ ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు.
ఎన్నికల్లో తప్పుడు హామీలు, అబద్ధాలతో గెలిచారని ఆరోపిస్తూ, ఇప్పుడు వాటిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందన్నారు. తాను మాట్లాడిన ప్రతి అంశం స్థానిక పత్రికల్లో వచ్చిన కథనాలు, రైతుల ఫిర్యాదుల ఆధారంగానేనని, వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం చేయడం, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే తన ఉద్దేశమని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. అప్పన్నపేట సింగిల్ విండో భవన ప్రారంభోత్సవ వివాదంపై వాస్తవాలను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వెళ్లడించారు. నాటి అధికారిక సింగిల్ విండో నూతన భవన ప్రారంభోత్సవ సమావేశంలో తాను ఆప్కాబ్ చైర్మన్ రవీందర్ రావుతో కలిసి తాము పాల్గొన్న మాట వాస్తవమేనన్నారు. అయితే.. అదే రోజు ఉదయం కాజీపేటలో తనకు ఒక రైల్వే కేసుకు సంబంధించిన కోర్టు పేషీ(హాజరు) ఉండటంతో, ఆ విషయాన్ని అక్కడి వారికి ముందే తెలియజేసి తాను త్వరగా బయలుదేరాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదన్నారు. తాను కాజీపేట వెళ్తున్న సమయంలో కొందరు మిత్రులు చెరువులకు నీరు కావాలని కోరగా.. ఆ సమయంలో పంటలు ఎండిపోతున్న తరుణంలో మొదట కాల్వల ద్వారా నీటిని అందించి పంటలను కాపాడటం ముఖ్యమని, చెరువుల నీటి సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తానని వారికి నచ్చజెప్పినట్లు తెలిపారు. అయితే, కొందరు ఆకతాయిలు కావాలనే ఈ విషయాన్ని రాజకీయం చేస్తూ, తాను పారిపోయినట్లు తప్పుడు ప్రచారం సృష్టించారని మండిపడ్డారు. ఆ రోజు తాను ‘ఎక్కడికీ పారిపోలేదు, ఏ దొంగతనమూ చేయలేదు. మరుసటి రోజే ఒంటరిగా మళ్లీ అదే గ్రామానికి వచ్చి ప్రజల మధ్య నిలబడి మాట్లాడాను అన్నారు. నా నిజాయితీకి ఆ అప్పన్నపేట గ్రామ ప్రజలే ప్రత్యక్ష సాక్షులు అని ఆయన సగర్వంగా ప్రకటించారు.
ఈ కార్యక్రమాన్ని వరి కల్లాల వద్ద జరిగిన గొడవగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, కానీ తాను వెళ్లింది సింగిల్ విండో అధికారిక మీటింగ్ కు మాత్రమేనని దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. అప్పన్నపేటలో వరి కల్లాల వద్ద ప్రతి సీజన్ లో ధాన్యం సేకరణ ఆలస్యమవుతుందనే మాట నిజమేనని, దానికి కారణం రైతులు అధిక లాభాల కోసం నంబర్ల వడ్లు(సన్న రకాలు) పండించడమేనని వివరించారు. మిల్లర్లు ఆ వడ్లను సేకరించడానికి నిరాకరించినప్పుడు.. తాను స్వయంగా రంగంలోకి దిగి, ప్రతి మిల్లుకు ఒక లారీ చొప్పున పంపించి రైతుల ధాన్యాన్ని సేకరింపజేసి వారికి అండగా నిలిచానని గుర్తుచేశారు. తాను ఎక్కడికి వెళ్లినా ప్రజల నమ్మకంతో ఒంటరిగానే వెళ్తానని, కొందరిలా వంద మందిని వేసుకుని తిరగాల్సిన భయం తనకు లేదు’ అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాజకీయ బురదజల్లే ప్రయత్నాలు మానుకుని, మాట్లాడే ముందు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలని ఎమ్మెల్యేకు హితవు పలికారు. వరి, మొక్కజొన్న రైతుల సమస్యలు, కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అధిక తూకాలు, ధాన్యం గ్రేడింగ్ లో జరుగుతున్న అక్రమాలు, బార్దాన్ కొరత, మట్టి-ఇసుక దందాలు, ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి వంటి అనేక అంశాలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చి రాత్రి పగలు అనకుండా అక్కడే తింటూ, అక్కడే పడుకుంటూ కాపలా కాస్తున్న పరిస్థితిని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నందున, అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు ఎక్కడ వర్షం వస్తుందోనని ఒక్కో రైతు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు.
అధిక తూకాల వ్యవహారంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు, గతంలో కొనుగోలు కేంద్రాల వద్ద తిరుగుతూ ‘40 కిలోల 650 గ్రాముల కంటే ఒక్క గ్రాము కూడా ఎక్కువ తూకం వేయనివ్వం’ అని చెప్పిన ప్రజాప్రతినిధులే ఇప్పుడు అదే కేంద్రాల్లో 41 కిలోల నుంచి 42 కిలోల వరకు తూకం వేయిస్తున్నారని ఆరోపించారు. 40.650 కంటే ఎక్కువ జోకితే దొంగతనమే.. అని ఘాటుగా వ్యాఖ్యానించారు. రైతుల నుంచి అదనంగా తీసుకుంటున్న ప్రతి కిలో వెనుక రైస్ మిల్లర్లు, కొందరు నాయకులు ఉన్నారని ఆరోపిస్తూ, “ఈ దొంగతనం వెనకాల మీరందరూ ఉన్నారు” అని నేరుగా విమర్శించారు. ప్రతి సంచిపై తరుగు పేరిట మరో అర కిలో నుంచి ఒక కిలో వరకు తగ్గిస్తున్నారని, మొత్తం మీద ప్రతి క్వింటాల్‌కు రైతు 4 నుంచి 5 కిలోల వరకు నష్టపోతున్నాడని అనాన్నారు. ధాన్యం గ్రేడింగ్ అంశాన్ని ప్రస్తావిస్తూ, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సూపర్ ఫైన్, ఫైన్ రకాల ధాన్యాన్ని గ్రేడ్-1గా గుర్తించి ప్రతి క్వింటాల్ కు అదనంగా 20 రైతులకు అందేలా చేశామని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అన్ని రకాల ధాన్యాన్ని కామన్ రకం కింద చూపిస్తూ రైతులకు రావాల్సిన అదనపు డబ్బును కట్ చేస్తున్నారని ఆరోపించారు. దాదాపు లక్షల క్వింటాళ్లకు రావాల్సిన ఆ ఇరవై రూపాయలు ఎక్కడికి పోతున్నాయి? అని ప్రశ్నించారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు నష్టం చేస్తున్నారంటూ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. మొక్కజొన్న రైతుల పరిస్థితిని ప్రస్తావిస్తూ “నెల పదిహేను రోజులుగా రైతులు కల్లాల్లో మొక్కజొన్న కుప్పలు పోసి ఎప్పుడెప్పుడు తూకం వేస్తారా అని ఎదురుచూస్తున్నారని అన్నారు. మొక్కజొన్న తడిస్తే బూజు ఎక్కుతుంది, ఫంగస్ వస్తుంది, దేనికీ పనికిరాదు అని తెలిసినా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని ప్రశ్నించారు. రైతులకు అవసరమైన బార్దాన్ సంచులు కూడా ప్రభుత్వం అందించలేకపోతూ, సంచులు కొనుక్కోండి రైతులారా.. అని చెప్పడం అన్యాయమని అన్నారు.
రైతు ఒక సంచి 30 నుండి 35వరకు కొనుగోలు చేస్తే ప్రభుత్వం మాత్రం 21 మాత్రమే చెల్లిస్తోందని, దీంతో రైతు నేరుగా నష్టపోతున్నాడని పేర్కొన్నారు. ప్రభుత్వానికే దొరకని సంచి రైతుకు ఎక్కడ దొరుకుతుంది? అని ప్రశ్నించారు. హమాలీలు లేరనే పేరుతో రైతులనే మీరు పది మందిని తెచ్చుకుని, మీరే నింపుకోండి అని చెప్పడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. మార్క్ ఫెడ్ కొనుగోళ్లను కొత్తగా ప్రచారం చేస్తున్నారని, కానీ గతంలో కూడా డీసీఎంఎస్ ద్వారా ఇదే విధంగా కొనుగోళ్లు జరిగాయని గుర్తు చేశారు.
శ్రీరాంపూర్, ఓదెల, జూలపల్లి, పెద్దపల్లి వంటి ప్రాంతాల్లో గతంలో కూడా రైతులు మొక్కజొన్నను ప్రభుత్వ కేంద్రాల్లో అమ్ముకున్నారని పేర్కొన్నారు. ఇదేదో కొత్త విషయం జరిగినట్టు మాట్లాడుతున్నారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు మార్క్ లక్ష్మణ్, మాజీ ఎంపీపీలు నూనేటి సంపత్‌యాదవ్, స్రవంతి మోహన్‌రావు, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డ, కౌన్సిలర్ వెన్నం సుజాత రవీందర్, సర్పంచ్‌లు గొడుగుల సతీష్, బోయిని శ్రీనివాస్, నాయకులు సందీప్‌రావు, పారుపల్లి గుణపతి, మొబీన్, పెంచాల శ్రీధర్, సరేష్‌బాబు, దేవయ్య, శ్రీనివాస్‌రెడ్డిలతో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.