Rajiv Yuva Vikasam scheme | కోరుట్ల, మే 26: ప్రభుత్వం దివ్యాంగులకు రాజీవ్ యువ వికాసం పథకంలో రిజర్వేషన్లు అందించాలని దివ్యాంగుల సంఘం నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దివ్యాంగులు స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ 2016 దివ్యాంగుల చట్టం ప్రకారం 5శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న క్రమంలో స్వయం ఉపాధి రుణాల మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న అర్హత గల నిరుద్యోగ దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అవకాశం ఇవ్వాలని మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగ సంఘం నాయకులు అబ్దుల్ అజీజ్, ఓం ప్రకాష్, వాడ్నాల శ్రీనివాసరావు, నాగరాజు, లంక దాసరి దేవదాస్, సాయిరాం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.