Korutla Gadi Buruj sites | కోరుట్ల, ఆగస్ట్ 4: పట్టణంలోని చారిత్రాత్మక కట్టడాలైన కోరుట్ల గడి బురుజులు, కోనేరు, స్థలాలను అన్యక్రాంతం కాకుండా పరిరక్షించాలని కోరుతూ పట్టణానికి చెందిన అఖిలపక్ష, ప్రజా సంఘాల నాయకులు కలెక్టర్ సత్య ప్రసాద్ కు సోమవారం ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర ఆధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ మాట్లాడుతూ పట్టణంలోని కాల్వగడ్డ ప్రాంతంలో మూడెకరాల ఇరవై ఒక గుంటల స్థలంలో చాళుక్య రాజుల కాలంలో నిర్మించిన వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన గడి బురుజు స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు.
అక్రమ దారుల కబంధహస్థల్లో చిక్కుకున్నాయని ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకొని కంచె నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. గడి గురుజుల చుట్టు పక్కల 15 మీటర్ల పరిధిలో కట్టడాల నిర్మాణానికి అనుమతిస్తూ ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసి చారిత్రక కట్టడాలను కాపాడాలన్నారు. ప్రజాప్రయోజనాల కోసం గడి గురుజు స్థలాల్లో కూరగాయల మార్కెట్, ఆహ్లదకరమైన పార్క్‌ను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో వారు కోరారు. ఈకార్యక్రమంలో అఖిలపక్ష, ప్రజాసంఘాల కమిటీ అధ్యక్షులు చెన్న విశ్వనాథం, నాయకులు చింత భూమేశ్వర్, ఎండీ మౌలానా, భూపెల్లి నాగేష్, సుతారి రాములు, కుంచెం శంకర్, గంగాధర్, రాజగంగారాం, తదితరులు పాల్గొన్నారు.