Allocation of land | పెగడపల్లి: పెగడపల్లి మండలం ఏడుమోటలపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి స్థలం కేటాయించాలని కోరుతూ, గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం ధర్మపురి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గ్రామ రైతులు వినతి పత్రం సమర్పించారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు గ్రామ సమీపంలో ప్రభుత్వ భూమి అనువుగా ఉందని, దాన్ని కేటాయించాలని వారు వినతి పత్రంలో కోరారు.
దీనికి మంత్రి లక్ష్మణ్‌కుమార్ స్పందిస్తూ, వెంటనే రెవెన్యూ అధికారులతో భూమి సర్వే చేయించి, కొనుగోలు కేంద్రానికి స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వచ్చే యాసంగిలో కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన ఐక్య వేదిక ధర్మపురి నియోజకవర్గం అధ్యక్షుడు నగావత్ జీవనా నాయక్, మాజీ సర్పంచ్ ఇస్లావత్ రవినాయక్, గిరిజన, రైతు సంఘం నాయకులు రామనాయక్, భరత్ రెడ్డి, బక్కనాయక్, లక్ష్మన్ నాయక్, సామానాయక్, గంగనాయక్, రాజన్ననాయక్, మోతీలాల్‌నాయక్, రాజేశంనాయక్, పంతులునాయక్ తదితరులు పాల్గొన్నారు.