కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 7 : ఎలాంటి షరతుల్లేకుండా దళితబంధు రెండో విడుత నిధులు గ్రౌండింగ్ చేపట్టాలని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ దళితబంధు లబ్ధిదారులు డిమాండ్ చేశారు. దళితబంధు సాధన సమితి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వంద మందికి పైగా లబ్ధిదారులు సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌కు తరలివచ్చారు.
ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి మొరపెట్టుకున్నారు. గ్రౌండింగ్ పేర కాలయాపన చేయద్దని విజ్ఞప్తి చేశారు. వరుస ఎన్నికలతో జాప్యం జరుగుతున్నదని, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైతే మళ్లీ ఎన్నికల కోడ్ వస్తుందని వాపోయారు. నిధుల కోసం కళ్లలో వత్తులేసుకొని వేచి చూస్తున్నామని ఆవేదన చెందారు.
మొదటి విడుత స్థాపించిన యూనిట్లపై విచారణ జరుపుతున్న తీరు, రెండో విడుత గ్రౌండింగ్ వ్యవహారంపై అయోమయం నెలకొన్నదని చెప్పారు. అధికారులు స్పందించి ఒక ప్రకటన విడుదల చేయాలని, సత్వరమే రెండో విడుత గ్రౌండింగ్ చేయాలని వేడుకున్నారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్ దళితబంధు పథకం బాధ్యతల్లో ఉన్న అధికారిని పిలిచి, లబ్ధిదారుల డిమాండ్లు పరిశీలించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో దళితబంధు సాధన సమితి కన్వీనర్ సురేశ్ మాట్లాడారు.
2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో 50 వేల నుంచి 9.90 లక్షల వరకు దళితబంధు సాయం పొందాల్సిన లబ్ధిదారులు 9 వేల పైచిలుకు ఉన్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా లబ్ధిదారుల ఖాతాలు ఫ్రీజింగ్ చేశారని, ఎన్నికలు ముగిసినా ఎత్తేయకపోవడంతో 13 నెలలుగా పోరాటం చేశామని, దాని ఫలితంగా జనవరి 27న రెండో విడుత నిధుల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని చెప్పారు.
ఆ సమయంలో శాసనమండలి ఎన్నికల కోడ్ రావడంతో మళ్లీ ఆలస్యం జరిగిందని వాపోయారు. కోడ్ ఎత్తేసిన అనంతరం గత నెల 10న కలెక్టర్‌ను కలిసి నిధుల విడుదలపై వేడుకోగా, మొదటి విడుత యూనిట్ల గ్రౌండింగ్‌పై విచారణ జరుపుతామంటూ ప్రకటించారని, ఇప్పటివరకు ఎలాంటి విచారణ చేపట్టలేదని, రెండో విడుత విడుదలపై అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. మొదటి విడుత లబ్ధిదారులకు పూర్తిగా చెల్లింపులు చేయకపోవడంతో ప్రారంభించిన యూనిట్ల గదుల అద్దె చెల్లించలేని పరిస్థితుల్లో ఖాళీ చేసినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మళ్లీ కోడ్ వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.