రాజన్న ఆలయం మూసివేతతో వేములవాడ పట్టణంలోని అద్దె గదుల నిర్వహణదారులు సందిగ్ధంలో పడ్డారు. అభివృద్ధి పేరిట ఇటీవల దర్శనాలను నిలిపివేయడంతో అయోమయం చెందుతున్నారు. సమ్మక్క జాతర నేపథ్యంలో భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశమున్నా.. ఈ సారి వస్తారో.. రారోనని అద్దె గదులు లీజుకు తీసుకోవడానికి వెనకాముందు అవుతున్నారు. ఇప్పటికే భక్తుల సంఖ్య తగ్గిందని, అద్దె గదులు తీసుకునే వారు సంఖ్య కూడా తగ్గిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది ఉపాధి కోల్పోయారని, పరిస్థితి ఇలాగే ఉంటే మరెంతో మంది రోడ్డున పడుతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేములవాడ, నవంబర్ 14 : దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత బద్ది పోచమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే భక్తుల వసతి కోసం వేములాడ పరిధిలో దాదాపు 500 అద్దె గదుల భవనాలు ఉండగా, పది వేల వరకు అద్దె గదులు ఉన్నాయి. ఇవన్నీ భక్తులపై ఆధారపడే నడుస్తున్నాయి. వందలాది మంది అద్దె గదులను రెండేళ్ల లీజుకు తీసుకొని, భక్తులకు కిరాయిలకు ఇస్తూ జీవనోపాధి పొందుతున్నారు.
పది గదులు ఉండే భవనానికి రెండేళ్లకు 8 లక్షల నుంచి 20 లక్షల వరకు లీజుకు తీసుకుంటున్నారు. రాజన్న సన్నిధికి వచ్చే భక్తులతోపాటు ప్రధానంగా సమ్మక-సారలమ్మ జాతరను దృష్టిలో పెట్టుకుని రెండేళ్లకోసారి రెన్యువల్ చేసుకునే విధానం ఉన్నది. జనవరిలో సమ్మక సారలమ్మ జాతర ఉండగా, ఇప్పటికే ఎములాడకు భక్తుల తాకిడి మొదలైంది. అంతలోనే అభివృద్ధి పేరిట రాజన్న ఆలయాన్ని ఇటీవల మూసి వేసి భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. దర్శనాలు లేకపోవడంతో భక్తులు ఏ మేరకు వస్తారో అంచనా వేయలేని పరిస్థితుల్లో అద్దె గదులను రెన్యువల్ చేసుకోవడంలో నిర్వాహకులు వెనుకడుగు వేస్తున్నారు.
రెన్యువల్ చేసుకోవాల్సిన గదులు కూడా కొన్నింటిని ఇప్పటికే వదులుకొని సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. మరోవైపు రాజన్న ఆలయానికి అత్యంత సమీపంలో ఉన్న వాటిని మాత్రమే తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. పెట్టుబడి పెట్టి గదులు లీజుకు తీసుకుంటే భక్తులు రాకపోతే నష్టపోయే ప్రమాదం ఉందని, అందుకే ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందని పలువురు వ్యాపారులు వాపోతున్నారు. గతేడాదితో పోలిస్తే 50 శాతం తకువకు ఇస్తేనే వాటి నిర్వహణకు తీసుకుంటున్నారు. అయితే, దీనికి కొందరు యజమానులు.. నిర్వాహకులకు సహకరిస్తున్నా.. మరికొందరు కరాఖండిగా వ్యవహరిస్తున్నారు. ఒప్పందాల ఉల్లంఘనలు.. యజమానులు, నిర్వాహకులకు మధ్య పలు గొడవలకు కూడా దారితీస్తున్నాయి.
అద్దె గదుల వ్యాపారంతో ముడిపడి ఉన్న కుటుంబాలు ఆలయం మూసివేతతో వీధిన పడుతున్నాయి. అద్దె గదులను నిర్వహిస్తూ ఉపాధి పొందుతూ మరో నలుగురికి ఉపాధి కూడా కల్పిస్తారు. రాజన్న సన్నిధికి వచ్చే భక్తులకు అద్దెగది కావాలని భక్తుడిని అద్దె గదుల సముదాయం వరకు తీసుకువచ్చే మధ్యవర్తి కూడా ఉంటాడు. అతనికి 100కు 20 కమీషన్ ఇస్తారు. ఇలా పనిచేసే వారు దాదాపు 500 మంది వరకు ఉంటారు. భవనాల నిర్వహణ కోసం మరికొంతమందిని సిబ్బందిని కూడా నియమించుకుంటారు. అందులో కూడా అనేక రకాల పనులు చేసుకునే అవకాశం ఉన్న కుటుంబాలు ఇప్పుడు ఉపాధి లేక రోడ్డున పడుతున్నాయి.