Harish Rao | హుజూరాబాద్ టౌన్, జూన్ 3: సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలను తొలగించడం హేయమైన చర్య అని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మండిపడ్డారు. అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే హరీష్ రావు పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొని, మాట్లాడారు. మాజీ ఆర్థిక శాఖ, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకల ప్లెక్సీలను, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించడం సిగ్గుచేటని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు శాఖలకు మంత్రిగా కొనసాగిన హరీష్ రావు ప్లెక్సీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇతర పార్టీల మాజీ మంత్రులను, మాజీ సీఎంలను ఏనాడూ ఇంత ఘోరంగా అవమానపరచలేదని గుర్తు చేశారు. ఇతర పార్టీల నాయకులపై ఇంత నిరంకుశంగా, కర్కోషకంగా వ్యవహరించింది లేదని, ప్రతి పార్టీ నాయకునికి తగిన గుర్తింపు ఇచ్చామని ఆయన అన్నారు. ఇలా ఫ్లెక్సీలను తొలగించడం మంచి పద్ధతి కాదని అన్నారు.
ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని, మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగుతారని, అలాగే మంత్రులుగా హరీష్ రావు, కేటీఆర్ ఉంటారని తెలిపారు. జనం మెచ్చిన నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు అని, ఎప్పుడు ప్రజలకు అండగా తోడుండి, ప్రజా సమస్యలను తీర్చే గొప్ప వ్యక్తి హరీష్ రావు అని, అలాంటి వ్యక్తి పోస్టర్లను చించి వేయడం, తొలగించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైనది కాదని, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.