పెద్దపల్లి, మార్చి 1 ( నమస్తే తెలంగాణ ) : మానేరు నదిలో అక్రమ టోల్ ట్యాక్సీ వసూళ్లకు అధికార యంత్రాం గం చెక్ పెట్టింది. కొద్దిరోజులుగా అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న దందాకు అడ్డుకట్ట వేసింది. ముత్తారం మండలం ఓడేడ్- జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి మానేరు నదిలో మట్టి రోడ్డుపై అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి కొద్దిరోజులుగా దర్జాగా చేస్తున్న వసూళ్ల దందాపై ‘దర్జాగా దారి దోపిడీ..’అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ మెయిన్‌లో, ‘గేటెయ్.. దోచేయ్..’అనే శీర్షికన జిల్లా ఎడిషన్‌లో శనివారం కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. కాగా, ఈ కథనాలు ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సంచలనం రేపాయి.
ఈ క్రమంలో పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పందించి సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే మానేరుపై అక్రమ టోల్ గేట్‌ను తొలగించాలని ఆదేశాలివ్వగా, ఉదయాన్నే మంథని సీఐ రాజుగౌడ్, ఆర్ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ అధికారులు ముత్తారం మండలం ఓడేడ్ మానేరు నదీ తీరానికి చేరుకున్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టోల్ గేట్‌ను తొలగించారు. ఇక్కడ ఎలాంటి వసూళ్లకు పాల్పడవద్దని, ఉచితంగానే వెళ్లనివ్వాలని నిర్వాహకులను హెచ్చరించారు. కాగా, అక్రమంగా ఏర్పాటు చేసిన టోల్ గేట్‌ను తొలగించడంతో ఆయా గ్రామాల ప్రజలకు వసూళ్ల బెడద తప్పింది. నిన్నటి వరకూ డబ్బులు చెల్లిస్తూ ప్రయాణించిన ప్రజలు శనివారం నుంచి ఉచితంగా ప్రయాణిస్తూ సంబురపడ్డారు. ‘నమస్తే తెలంగాణ’కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక్కడి బ్రిడ్జి పూర్తికాక పోవుడేందో గానీ ఇక్కడి మట్టి రోడ్డు మీది నుంచి పోయేతందుకు ఇన్నాళ్లూ మాకు చాలా టాక్సీ పడ్డది. వీళ్లకు పైసలు ఇయ్యలేక తిప్పలవడ్డం. అడిగేటోళ్లే లేకపోయిన్రు. బాధపడుకుంటనే కట్టినం. ఏది ఏమైనా ‘నమస్తే తెలంగాణ’లో వార్త వచ్చుడేమోగానీ టోల్ గేట్ పోయింది. మాకైతే ఈ టాక్సీ బాధ తప్పింది. చాలా సంతోషంగా ఉంది.
నేను వ్యాపార పనుల కోసం వివిధ ప్రాంతాలకు తిరుగుతుంటా. మానేరువాగు గుండా టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి, పరకాల తదితర ప్రాంతాలకు వెళ్లి వస్తుంటా. ఈ రోడ్డుపై టోల్ వసూలు చేసేవాళ్లు చాలా దురుసుగా ప్రవర్తించేవారు. ఈ చిన్న కిలో మీటర్ రోడ్డుకు రూ.100 తీసుకునేటోళ్లు. హైవేపై కూడా ఇంత లేదని నేను వాదించా. నిలదీసిన. వాళ్లు మాత్రం నీ ఇష్టం ఇటు వస్తే రా లేకపోతే లేదని దురుసుగా ప్రవర్తించే వారు. ఈరోజు ఈ మార్గంగా గుండా చిట్యాలకు వెళ్తుంటే టోల్గేట్ లేదు. విషయం తెలుసుకొని చాలా సంబురపడ్డా. మళ్లీ ఎలాంటి ఒత్తిళ్లకు లోనవ్వకుండా అధికారులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరుకుంటున్నా.