తిమ్మాపూర్ మార్చ్24: తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలను ఆవిష్కరించాలని గత 15 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం రవాణా శాఖ కార్యాలయంలో అభివృద్ధి పనుల కోసం వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలకు జేఏసీ నాయకులు.. బస్టాండ్ లోని విగ్రహాలను ఆవిష్కరణ జరిగేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరేందుకు వినతిపత్రం అందజేసే ప్రయత్నం చేయగా వారు స్పందించిన విధానం సరిగా లేదని, సోమవారం రిలే దీక్ష శిబిరం వద్ద జేఏసీ కన్వీనర్లు సుగుర్తి జగదీశ్వర చారి, వంతడుపుల సంపత్, మాతంగి శంకర్, దుండ్ర రాజయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు.
మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఆవిష్కరణ కోసం కృషి చేయాలని వినతి పత్రం ఇచ్చేందుకు వెళితే కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే మీరు పదవుల్లో ఉన్నారని.. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు పట్టింపు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఏ విధంగా, ఎవరు రాసిన రాజ్యాంగం ప్రకారం పెంచి ప్రయోజనం పొందాలని చూస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
మహనీయుల విగ్రహాలు పెడితే తప్పేంటి అని ప్రశ్నించారు. విగ్రహాల చుట్టూ చెత్తాచెదారం నిండిపోయిందని మహనీయులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ధ్వజమెత్తారు. అలాగే రిలే దీక్షకు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వర్ణ వెంకటరెడ్డి, వివిధ సంఘాల అధ్యక్షులు మాచర్ల అనిల్, లక్ష్మణ్, కన్నం లక్ష్మణ్, మాజీ సర్పంచ్ వడ్లూరు శంకర్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మాజీ సభ్యులు ఎలుక ఆంజనేయులు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ పాశం అశోక్ రెడ్డి, నాయకులు సంగుపట్ల మల్లేశం, కొయ్యడ మురళి, సముద్రాల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.