పెద్దపల్లి, ఆగస్టు11(నమస్తే తెలంగాణ): జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కల నెరవేరింది. ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం తీపి కబురు అందించింది. జిల్లాలోని 186 జూనియర్ పంచాయతీ కార్యదర్శులలో 112 మంది నాలుగేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. వీరిలో ఇప్పటివరకు 29 మంది కార్యదర్శుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేసి రెగ్యులరైజ్ చేశారు. మిగిలిన అభ్యర్థులకు 10 రోజులలో రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తి చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో కలిసి 29 మందికి ప్రొసీడింగ్స్‌ను అందజేయగా, జేపీఎస్‌లు మురిసిపోయారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉద్యోగులను ఆదరించే అంశంలో సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచిస్తారని, ఇటీవల వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేశామని, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ కొనసాగుతుం దని చెప్పారు. మిగిలిన జానియర్ పంచాయతీ కార్యదర్శులకు పది రోజుల వ్యవధిలో రెగ్యులరైజేషన్ ప్రొసిడింగ్స్ అందజేస్తామని తెలిపారు.
మా సేవలకు గుర్తింపు
నేను ఎంటెక్ చేశా. 2019లో సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా జాయిన్ అయ్యా. చిన్న ఉద్యోగం అయినా సరే ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కినందుకు సంతోష పడ్డా. కానీ ఉద్యోగ భద్రత లేదనే ఆందోళన ఉండేది. ఇప్పుడు ఆ బెంగ లేదు. మా సేవలను గుర్తించి రెగ్యులర్ చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక నుంచి రెట్టింపు ఉత్సహంగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకవస్తా. ప్రభుత్వ పథకాలను ఆర్హులకు అందేలా కృషి చేస్తా.
– సిరిశేటి ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి గర్రెపల్లి జీపీ, సుల్తానాబాద్ (పెద్దపల్లి)
మరింత పట్టుదలతో పని చేస్తా
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను గ్రేడ్ -4 పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోషన్ ఇవ్వడం చాలా సంతోషం. మరింత పట్టుదలతో పని చేసి నూటికి నూరు శాతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కృషి చేస్తా. నాకు కేటాయించిన గ్రామ పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా పని చేస్తా.
– తంజావురు సోనియా, గ్రేడ్ -4 పంచాయతీ కార్యదర్శి, దుబ్బపల్లి జీపీ, సుల్తానాబాద్(పెద్దపల్లి)
సంతోషంగా ఉంది..
జానియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం చాలా సంతోషం. ఉద్యోగ భద్రత లేదనే ఇంత కాలం మధన పడ్డా. ఇక రంది కూడా లేదు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పట్ల మంచి నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణ పడి ఉంటా
– కొలిపాక అబిజిత్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, లోకపేట (ఎలిగేడు)